20లోగా కౌంటింగ్‌ ఏజెంట్ల పేర్లివ్వాలి

Counting agents names must be give by 20th of this month - Sakshi

ఎన్ని టేబుళ్లుంటే అంతమంది ఏజెంట్లకు అనుమతి

17లోగా టేబుళ్ల సంఖ్యపై స్పష్టత

వ్యక్తిగత భద్రత ఉన్న వారిని ఏజెంట్లుగా అనుమతించరు

భద్రత ఉపసంహరించుకున్నా కుదరదు..

ఈసారి ఏజెంట్ల నేర చరిత్రనీ పరిశీలిస్తున్న ఈసీ

రాజకీయ పార్టీల గుర్తింపు ఆధారంగా ఏజెంట్ల సీట్లు కేటాయింపు

సాక్షి, అమరావతి: ఈనెల 23న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏజెంట్లదే కీలక పాత్ర. అందుకే పోటీలో ఉన్న అభ్యర్థులు తమకు అత్యంత నమ్మకమున్న వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుంటారు. అందులో ఈసారి తొలిసారిగా వీవీప్యాట్ల లెక్కింపు ఉండటంతో ఏజెంట్లు మరింత కీలకంగా మారనున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏజెంట్లుగా ఎవరిని నియమించాలి? ఎవరిని నియమించకూడదు? పోటీచేసే అభ్యర్థులు ఏజెంట్ల వివరాలను ఎప్పటిలోగా ఇవ్వాలి? టేబుళ్ల వద్ద ఎక్కడ కూర్చోవాలి.. ఇలా ప్రతీ అంశంపై ఎన్నికల నిబంధనావళిలో స్పష్టంగా పేర్కొన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్ల విషయంలో ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు ఇవిగో ఇలా..

కౌంటింగ్‌ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం ఒకేసారి అనేక టేబుళ్లను ఏర్పాటుచేసి ఓట్ల లెక్కింపును చేపడుతుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థి అన్ని టేబుళ్ల వద్ద జరుగుతున్న లెక్కింపును పరిశీలించలేరు కాబట్టి ఆయన స్థానంలో ఏజెంట్లను నియమించుకోవడానికి చట్టం అనుమతిస్తోంది. కాబట్టి ఎన్ని టేబుళ్లు ఏర్పాటుచేస్తే అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవచ్చు.. కౌంటింగ్‌ హాల్‌ పరిమాణం బట్టి ఎన్ని టేబుళ్లు ఏర్పాటుచేయాలన్నది ఆ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నిర్ణయిస్తారు. సాధారణంగా ప్రతీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు మించకుండా ఏర్పాటుచేస్తారు. దీనికి అదనంగా రిటర్నింగ్‌ అధికారి బల్ల ఒకటి ఏర్పాటుచేస్తారు.

ఈ రిటర్నింగ్‌ అధికారి బల్లపైనే పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీసు ఓటర్లు, వీవీప్యాట్లను లెక్కిస్తారు. అంటే మొత్తం 15 టేబుళ్లకు ప్రతీ అభ్యర్థికీ కనీసం 15 మంది ఏజెంట్లు అవసరమవుతారు. అదే విధంగా పార్లమెంటుకు, శాసనసభకు వేర్వేరుగా టేబుళ్లు ఏర్పాటుచేస్తారు కాబట్టి నియోజకవర్గానికి ప్రతీ పార్టీ కనీసం 30 మంది ఏజెంట్లను నియమించుకోవాల్సి వస్తుంది. కొన్నిచోట్ల ప్రత్యేక అనుమతితో అదనపు టేబుళ్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏజెంట్లను నియమించుకోవడానికి వీలుగా కనీసం ఒక వారం ముందుగానే ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామన్న వివరాలను అభ్యర్థులకు తెలియజేస్తారు. మన రాష్ట్రంలో కౌంటింగ్‌పై మే 17న కేంద్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుండటంతో ఆ సమయానికి టేబుళ్ల సంఖ్యపె స్పష్టత వచ్చే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కాగా, ఈసారి ఏజెంట్ల నేర చరిత్రనీ ఈసీ పరిశీలిస్తోంది. 

వీరు కూడా ఏజెంట్లుగా అనర్హులు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు
పార్లమెంటు/శాసనసభ/శాసన మండలి సభ్యులు
మేయర్లు, మున్సిపల్, నగర పంచాయితీ చైర్మన్లు
జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, బ్లాక్‌ లెవెల్, పంచాయితీ సమితి చైర్‌పర్సన్లు
ఎన్నికైన జాతీయ, రాష్ట్ర, జిల్లా కో–ఆపరేటివ్‌ చైర్‌పర్సన్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అధిపతులు, ప్రభుత్వ ప్లీడర్లు, అడిషనల్‌ గవర్నమెంటు ప్లీడర్లు

మూడు రోజులు ముందుగా పేర్లు ఇవ్వాలి..
ఫారం–18 దరఖాస్తు ద్వారా ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. పోటీచేసిన అభ్యర్థి లేదా అతను నియమించుకున్న ఏజెంటుగానీ కౌంటింగ్‌ ఏజెంటును నియమించుకోవచ్చు. అలాగే, విడివిడిగా కానీ అందరి పేర్లు ఒకేసారి ఫారం–18లో పూర్తిచేయడం ద్వారా కానీ నియమించుకోవచ్చు. ఏజెంటు పేరు, చిరునామాతో పాటు ఫొటోలు జతచేసి సంతకం చేసి రెండు కాపీలను తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కాపీ రిటర్నింగు ఆఫీసర్‌కు పంపి, రెండో కాపీ కౌంటింగ్‌ రోజు రిటర్నింగ్‌ అధికారికి చూపించేందుకు ఏజెంటుకు ఇవ్వాలి. నియోజకవర్గంలోని పోటీచేసే అభ్యర్థులందరూ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఓట్ల లెక్కింపునకు మూడు రోజులు ముందు అంటే మే 20 సాయంత్రం 5 గంటల లోపు ఏజెంట్ల వివరాలను రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారి ఏజెంటు గుర్తింపు కార్డులను తయారుచేసి అభ్యర్థికిస్తారు. కౌంటింగ్‌ సమయంలో ఈ గుర్తింపు కార్డు, నియామక పత్రం చూపించాల్సి ఉంటుంది. లెక్కింపు మొదలయ్యే సమయానికి ఒక గంట ముందుగా ఏజెంటు రిటర్నింగ్‌ అధికారికి గుర్తింపు కార్డులను చూపించాలి. ఈలోపు వచ్చిన వారిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతిస్తారు. ఫారం–19 ఉపయోగించుకోవడం ద్వారా అభ్యర్థులు నియమించుకున్న ఏజెంట్లను ఉపసంహరించుకోవచ్చు. 

వ్యక్తిగత భద్రత ఉన్న వారికి నో ఎంట్రీ
- 18 ఏళ్లు నిండిన వారిని అభ్యర్థులు ఏజెంట్లుగా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ఇలా ఎంపిక చేసే వ్యక్తుల విషయంలో స్పష్టమైన ఆదేశాలున్నాయి. అవి..
కౌంటింగ్‌ హాల్‌లోకి భద్రతా సిబ్బందిని అనుమతించరు కాబట్టి వ్యక్తిగత భద్రత కలిగిన వ్యక్తులను ఏజెంట్లుగా అనుమతించరు. 
ఒకవేళ ఏజెంటుగా నియమించుకోవడానికి ఆ వ్యక్తి భద్రతను ఉపసంహరించుకున్నా సరే అనుమతించడానికి వీల్లేదని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. కౌంటింగ్‌ కోసం భద్రతను ఉపసంహరించుకుంటే అతని భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సెక్యూరిటీ పొందుతున్న ఏ వ్యక్తిని కూడా కౌంటింగ్‌ ఏజెంటుగా అనుమతించరు. 
ప్రజా ప్రతినిధుల చట్టం–1951 ప్రకారం కౌంటింగ్‌ ఏజెంటుగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించకూడదు. ఇలా చేసిన వ్యక్తికి జరిమాన, మూడు నెలల జైలుశిక్ష లేక రెండూ విధించే అవకాశముంది. 

బయటకు రావడానికి వీల్లేదు
ఓటింగ్‌ రహస్యానికి సంబంధించిన ప్రకటనపై సంతకం చేసిన తర్వాతే ఏజెంట్‌ను హాలులోకి పంపిస్తారు. ఏజెంటు ఏ అభ్యర్థికి చెందిన వారు, ఏ సీరియల్‌ నెంబరు టేబుల్‌ వద్ద లెక్కింపు గమనిస్తారో సూచించే బ్యాడ్జీలను రిటర్నింగ్‌ అధికారి ఇస్తారు. ఏ టేబుల్‌ కేటాయించారో అక్కడే కూర్చోవాలి కానీ హాలంతా తిరగడానికి అనుమతించరు. రిటర్నింగ్‌ అధికారి బల్ల దగ్గర ఉండే ఏజెంటు మిగిలిన ఏజెంట్లు లేని సమయంలో ఆ టేబుళ్ల దగ్గరకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఒకసారి కౌంటింగ్‌ హాలులోకి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్లడానికి అనుమతించరు. వీరికి కావాల్సిన అన్నిరకాల మౌలిక వసతులను లోపలే ఏర్పాటుచేస్తారు. టేబుల్స్‌ దగ్గర ఏజెంట్ల సీట్ల కేటాయింపు పార్టీల గుర్తింపు ఆధారంగా నియమిస్తారు.
తొలుత గుర్తింపు పొందిన జాతీయ పార్టీ ఏజెంటు
గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల ఏజెంట్లు
నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొంది, ఇతర చిహ్నాలను ఉపయోగించుకున్న అభ్యర్థులు
నమోదై గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు
స్వతంత్ర అభ్యర్థులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top