అదానీలకు ప్రేమతో...

Chandrababu Irregularities at high level before the Elections movements - Sakshi

ఎన్నికల ముందు కమీషన్ల కోసం బొగ్గు గనుల సంతర్పణ

అదానీకి సులియారీ, ఎస్సెల్‌కు దక్షిణ మదన్‌పూర్‌ బొగ్గు గనులు

ఓ కీలక అధికారి ద్వారా ‘ముఖ్య’నేత సంప్రదింపులు 

రెండు సంస్థలకే టెండర్లు దక్కేలా చక్రం తిప్పిన వైనం

ఎండీవో ఎంపిక టెండర్లలో అక్రమాలు

వాటాలు ఇచ్చిన సంస్థలకే కాంట్రాక్టు

ఫిర్యాదులు పట్టించుకోకుండా రివర్స్‌ వేలం

‘టెయిలర్‌ మేడ్‌’ నిబంధనలతో ప్రక్రియ పూర్తి

‘బొగ్గు గనుల్లో మేత’ను ముందే చెప్పిన ‘సాక్షి’

ఎన్నికల ముంగిట సీఎం చంద్రబాబు అవినీతి తవ్వకాలు తారస్థాయికి చేరిపోయాయి.అధికారం ఆఖరి క్షణాల్లో రూ.24 వేల కోట్లకుపైగా విలువైన బొగ్గు గనుల్ని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేస్తున్నారు. అది కూడా వేరెవరికో కాదు! తానిప్పుడు పోరాడుతున్నట్లు బిల్డప్‌ ఇస్తున్న ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులైన అదానీ, ఎస్సెల్‌ గ్రూపులకి!. చిత్రమేంటంటే మోదీకి అత్యంత సన్నిహితుడిగా అందరికీ తెలిసిన ఇదే అదానీకి భావనపాడు పోర్టు నిర్మాణాన్ని చంద్రబాబు అప్పగించారు. విశాఖలో సోలార్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామంటే 500 ఎకరాలు ధారాదత్తం చేసి పది రోజుల కిందటే ఎంవోయూ కూడా చేసుకున్నారు. అదానీతో బొగ్గు బ్లాకుల చీకటి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుని... దాని ప్రకారం స్క్రీన్‌ప్లే నడిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఏపీఎండీసీకి ఉన్న విలువైన గనుల్ని అదానీ, ఎస్సెల్‌ గ్రూపులకు దక్కేలా అనుకూలమైన నిబంధనల్ని విధించడమే కాకుండా... వారికి పోటీ లేకుండా చేసి మరీ రివర్స్‌ వేలంలో అధిక ధరకు అప్పగిస్తున్నారు. అంటే ఆ బ్లాకుల్ని అప్పగించటమే కాకుండా అవి తవ్వి తీసే ప్రతి టన్నుకూ ఏపీఎండీసీ అత్యధిక ధర చెల్లించి కొంటుందన్న మాట. పనిగట్టుకుని పక్క రాష్ట్రాలు తిరిగి మరీ మోదీని విమర్శిస్తున్న చంద్రబాబు... ఆయన సన్నిహితులకు ఇంత భారీ ప్రాజెక్టులు అప్పగించటం వెనక అర్థమేంటి? రాష్ట్రాన్ని గుజరాత్‌లా మార్చటమంటే నిబంధనల్ని కాలరాసి మరీ ప్రాజెక్టులన్నీ అదానీకి అప్పగించటమా? మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీతో చంద్రబాబుకు తెరచాటు బంధం లేదంటే నమ్మగలమా?

ఎస్సెల్‌కు.. రూ. 12,609.60 కోట్లు
టన్ను బొగ్గు తవ్వకానికి ఎస్సెల్‌ రూ. 888 చొప్పున ధర కోట్‌ చేసింది.దీంతో మదన్‌పూర్‌ గని ఎండీవోగా ‘ఎస్సెల్‌’ను ఖరారు చేయనున్నారు. ఈ గనిలో సుమారు 187 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇందులో 142 మిలియన్‌ టన్నుల బొగ్గును తవ్వవచ్చని అంచనా. టన్నుకు రూ. 888 ప్రకారం 142 మిలియన్‌ టన్నులు తవ్వినందుకు ఏపీఎండీసీ ఈ సంస్థకు రూ. 12,609.60 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా ఖనిజం తవ్వితే ఆ మేరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

అదానీకి..   రూ. 11,542 కోట్లు
సులియారీలోని గనిలో 147 మిలియన్‌ టన్నుల ఖనిజం ఉండగా 116  మిలియన్‌ టన్నుల బొగ్గు తవ్వవచ్చని అంచనా. టెండర్లలో దీనిని దక్కించుకున్న అదానీ గ్రూపునకు టన్నుకు రూ. 995 చొప్పున 116  మిలియన్‌ టన్నుల బొగ్గు తవ్వినందుకు ఏపీఎండీసీ రూ. 11,542 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

సాక్షి, అమరావతి: ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డబ్బులు వెదజల్లే అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. కమీషన్ల కోసం, అందుకు సహకరించే కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుని వారితో రాయబారాలు నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన బొగ్గు గనుల నిర్వహణ కోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ దీనికి ఉదాహరణ. ఎప్పుడో ఏడాది క్రితం మొదలైన ఈ ప్రక్రియ ఎన్నికల సమయంలో క్లైమాక్స్‌కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ‘టెయిలర్‌ మేడ్‌’ నిబంధనలు రూపొందించి తమకు కమీషన్లు చెల్లించేవారివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ బొగ్గు గనుల నిర్వహణ టెండర్ల వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను ఓ సీనియర్‌ అధికారికి అప్పగించినట్లు తెలిసింది. అనంతరం రెండు సంస్థలతో మాట్లాడుకుని రివర్స్‌ టెండర్ల ద్వారా గనులు అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఇటీవల అమరావతిలో పర్యటించిన అనంతరం ఆ గ్రూప్‌నకు సులియారి బొగ్గు గని అభివృద్ధి నిర్వహణ (ఎండీవో) కట్టబెట్టేలా రంగం సిద్ధం కావడం గమనార్హం. నిజానికి ఈ టెండర్లు ఏడాది క్రితమే పిలిచారు. ఐదు సంస్థలు ఇందులో ఎంపిక కాగా తమకు నచ్చినవారికి అప్పగించేందుకే ఇంతకాలం సాగదీసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక నేడే రేపో ఈ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికల వ్యయం కోసం డబ్బులు ముందుగానే ముట్టజెప్పే సంస్థలతో ఒప్పందాలు చేసుకుని తమకు అనుకూలమైన నిబంధనలు పొందుపరిచినట్లు  మైనింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

అమరావతి పర్యటన వెనుక మతలబు?
ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని సులియారి, సౌత్‌ మదనపూర్‌లో బొగ్గు బ్లాకులున్నాయి. బంగారు బాతుల్లాంటి వీటిని తనకు అనుకూలమైన సంస్థలకు కట్టబెట్టి వాటాలు పొందాలని ఎత్తుగడ వేసిన ముఖ్యనేత ఏపీఎండీసీని పావుగా మార్చుకుని తనకు అనుకూలమైన పెద్ద సంస్థలు మాత్రమే బిడ్డింగులో పొల్గొనేలా నిబంధనలు రూపొందించారు. టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన సంస్థలను కలసిన ఓ కీలక అధికారి ముఖ్యనేత ఆంతర్యాన్ని వివరించారు. అనంతరం బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణ (ఎండీవో) ఎంపిక కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచారు. మౌఖిక సంప్రదింపుల ద్వారా మరికొన్ని సంస్థలను టెండర్ల నుంచి తప్పించడంలో ఆ కీలక అధికారి పాత్ర పోషించారు. సాంకేతిక టెండర్లలో అర్హత సాధించిన రెండు సంస్థల యాజమాన్యాలతో ఇటీవల సమావేశమైన ‘ముఖ్య’నేత వాటాలపై సంప్రదింపులు జరిపారు. పది రోజుల క్రితం అమరావతిలో అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ పర్యటన అనంతరం సులియారి ఎండీఓ కాంట్రాక్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు కట్టబెట్టేలా రివర్స్‌ వేలంలో మంత్రాంగం నడిచినట్లు పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ సమీపంలో సోలార్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు పేరుతో ఇదే గ్రూపు కోసం 500 ఎకరాలను ప్రభుత్వం అప్పగించడం గమనార్హం.

టెండర్‌ ప్రమాణాలకు విరుద్ధంగా...
దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇదే తరహా పనుల కోసం నిర్వహించిన టెండర్లలో అనుసరించిన నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ వ్యవహరించడం విమర్శలకు బలం చేకూరుస్తోంది.  ఎక్కువ సంస్థలు పోటీపడే అవకాశం కల్పించాలంటూ చేసిన విజ్ఞప్తులను ఏపీఎండీసీ పెడచెవిన పెట్టింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ చేసిన కేటాయింపుల్లో మదన్‌పూర్‌ దక్షిణ, సులియారి బొగ్గు గనులు ఏపీఎండీసీకి లభించాయి. వీటి అభివృద్ధి, నిర్వహణ సంస్థను ఎంపిక చేసేందుకు మెటల్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌టీసీ) ద్వారా ఏపీఎండీసీ ఇ– టెండర్లు (ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు) ఆహ్వానించింది. ఈమేరకు గత ఏడాది మార్చి 19వ తేదీన టెండర్‌  నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలను ‘సాక్షి’ ముందుగానే బహిర్గతం చేసింది. ఈమేరకు 2018 మే 2వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘బొగ్గు గనుల్లో మేత’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అది నిజమేనని ఈరోజు తేలింది. 

రివర్స్‌ వేలం ఇదీ..
మొదటి దశ టెండర్లలో అర్హమైనవిగా నిర్ణయించిన సంస్థలకు మాత్రమే తాజాగా రివర్స్‌ వేలం నిర్వహించారు. ఒక రేటు నిర్ణయించి దాని నుంచి ఏ సంస్థ తక్కువకు కోట్‌ చేస్తే దానికి టెండరు అప్పగించే విధానాన్ని రివర్స్‌ వేలం అంటారు. రివర్స్‌ వేలంలో రెండు గనులను దక్కించుకున్న సంస్థలకు బొగ్గు తవ్వినందుకుగానూ ఏపీఎండీసీ కనీసం రూ. 24,151.60 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 24 వేల కోట్లకు పైగా విలువైన ఈ కాంట్రాక్టు పనులను ఎన్నికల ముందు హడావుడిగా రెండు సంస్థలకు కట్టబెట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకింత రహస్యం?
సాధారణంగా టెండరు నోటిఫికేషన్‌ను ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని అర్హతలు, నిబంధనలు, పనుల వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఏపీఎండీసీ బొగ్గు గనుల ఎండీవో ఎంపిక టెండర్ల విషయంలో ఈ నిబంధనలను గాలికొదిలేసింది. సంస్థ వెబ్‌సైట్‌ టెండరు ప్రకటనలో కేవలం ఎండీఓ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. ఆసక్తి కలిగినవారు ఎంఎస్‌టీసీలో పేర్లు నమోదు చేసుకుని రూ. 50 వేల దరఖాస్తు రుసుము చెల్లించి నిబంధనలు తెలుసుకోవచ్చని పేర్కొంది. నిబంధనలు, పనుల  వివరాలు తెలుసుకోవడానికి అంత డబ్బు కట్టాలని షరతు విధించడాన్ని బట్టే ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏపీఎండీసీ గతంలో బెరైటీస్‌ ఖనిజ తవ్వకాలకు ఎంఎస్‌టీసీ ద్వారానే ఇ– టెండర్లు పిలిచింది. అయితే అప్పుడు నిబంధనలన్నీ టెండరు నోటిఫికేషన్‌లోనే పేర్కొంది. 

ఇతర సంస్థలకు భిన్నంగా....
నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) తలైపల్లి, మదన్‌పూర్‌ సౌత్‌ బొగ్గు గనులు,  పశ్చిమ బెంగాల్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూబీపీడీసీఎల్‌) పచ్వారా కోల్‌బ్లాకు, తెలంగాణ స్టేట్‌ జెన్‌కో తాడిచెర్ల –1 కోల్‌బ్లాకుకు ఎండీఓల ఎంపిక కోసం ఇ– టెండర్లు పిలిచాయి.  అయితే ఈ సంస్థలు పేర్కొన్న సాంకేతిక అర్హతలకు భిన్నంగా ఏపీఎండీసీ షరతులు విధించింది. అధిక పరిమాణంలో బొగ్గు తవ్విన అనుభవం ఉన్న సంస్థలే టెండర్లలో పాల్గొనేలా షరతులు పెట్టింది. 

స్పందించని ఏపీఎండీసీ అధికారులు
రివర్స్‌ వేలంలో అదానీ, ఎస్సెల్‌ తక్కువ మొత్తం కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచాయని, వీటికే ఆయా గనుల ఎండీవో కాంట్రాక్టును అప్పగించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అయితే ఏపీఎండీసీకి ఈ కాంట్రాక్టును ఖరారు చేసే అధికారంతోపాటు రద్దు చేసే అధికారం కూడా  ఉంది. వివరాలు లీక్‌ అయ్యాయని భావిస్తే కాంట్రాక్టును రద్దు చేసే అధికారం కూడా ఉందని సమాచారం. ఈ విషయంపై ఏపీఎండీసీ అధికారులను వివరణ కోరడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా స్పందించలేదు. 

ఎండీవో అంటే....?
ఎండీవో అంటే మైన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్‌ అని అర్థం. ఓ బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ అధికారం మొత్తం ఎండీవోకే ఉంటుంది. నిర్దేశిత ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను పూర్తిగా వెలికితీసే వరకూ ఆ ప్రాంతంపై పూర్తి హక్కులు ఎండీఓకే ఉంటాయి. అంటే ఇది జీవితకాల కాంట్రాక్టు. ఉదాహరణకు ఏపీఎండీకి చెందిన మదన్‌పూర్‌ గనిలో సుమారు 187 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇందులో 142 మిలియన్‌ టన్నుల దాకా బొగ్గు తవ్వవచ్చని అంచనా. (భద్రతా ప్రమాణాల దృష్ట్యా కొంత ఖనిజాన్ని తవ్వరు). ఇక సులియారీలోని గనిలో 147 మిలియన్‌  టన్నుల ఖనిజం ఉండగా 115 మిలియన్‌ టన్నుల  బొగ్గు తవ్వవచ్చని అంచనా. నిబంధనల ప్రకారం గని నిర్వహణతోపాటు తవ్వకాలు జరిపి ఓవర్‌ బర్డన్‌ (వృథా మట్టి)ని తొలగించి విక్రయానికి పనికొచ్చే బొగ్గును  ఏపీఎండీసీకి అప్పగించాల్సిన బాధ్యత ఎండీవోదే. ఈ రెండు గనుల ఎండీవోల ఎంపిక కోసం ఏపీఎండీసీ వేర్వేరుగా ఇ –టెండర్లు నిర్వహించినా దాదాపుగా అవే సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, సైనిక్‌ మైనింగ్, ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, బీజీఆర్‌ – ఎస్‌ఐసీఏఎల్‌ కన్సార్టియం బిడ్‌లో అర్హత పొందాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top