రాష్ట్ర విభజన అంశం వృత్తి విద్యా కాలేజీలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని కళాశాలలపైనే విభజన అంశం గణనీయమైన ప్రభావం చూపనుంది.
రాష్ట్ర విభజనతో సీట్ల భర్తీపై తీవ్ర ప్రభావం
నాలుగైదేళ్లలో భారీగా సీట్లు మిగిలిపోయే సూచనలు
ఇంజనీరింగ్ కళాశాలల మనుగడకు ప్రమాదం!
ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీల్లోనూ అదే పరిస్థితి
హైదరాబాద్‌లోని కార్పొరేట్ సంస్థల్లో ప్రవేశాలు తగ్గే అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశం వృత్తి విద్యా కాలేజీలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని కళాశాలలపైనే విభజన అంశం గణనీయమైన ప్రభావం చూపనుంది. తెలంగాణ ప్రాంతంలోని వృత్తివిద్య కళాశాలల్లో వచ్చే నాలుగైదేళ్లలో భారీగా సీట్లు మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3.5 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా.. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 1.5 లక్షలకు పైగా సీట్లు ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం 716 కళాశాలలు ఉంటే.. తెలంగాణలో 352 కళాశాలలున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే దాదాపు లక్ష సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించి కన్వీనర్ కోటాలో 85 శాతం సీట్లను స్థానిక అభ్యర్థులతో, 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. ఈ 15 శాతం ఓపెన్ కేటగిరీ సీట్లలో కొన్నింటితో పాటు సీమాంధ్ర ప్రాంతం అయినప్పటికీ ఇక్కడే చదువుకున్న వారితో కలిపి మొత్తంగా 30 శాతం మంది విద్యార్థులు లోకల్ కోటాలో సీట్లు పొందుతున్నట్టు అంచనా.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఏ ప్రాంతంలో పూర్తిచేసినప్పటికీ.. నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య నాలుగేళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో చదివితే వారు లోకల్ కేటగిరీలోనే అడ్మిషన్ పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణలో చదివిన వారంతా భవిష్యత్తులోనూ ఇక్కడే వృత్తివిద్య పూర్తిచేసే అవకాశం ఉంటుంది. అయితే నాలుగైదేళ్లలో క్రమంగా ఇక్కడికి వచ్చి నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కష్టంగా మారనుంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సీట్లలో 2 లక్షల ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణలో సీట్లు నిండనిపక్షంలో ఆయా కళాశాలల భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే దీనిపై కళాశాలల యాజమాన్యాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘రాష్ట్ర విభజన అంశం తెలంగాణ ప్రాంతంలోని కళాశాలలపై ఎలాంటి ప్రభావం చూపదు. 2009 నుంచే ఇక్కడ చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. ఇప్పుడు కొత్తగా ప్రభావం ఏమీ ఉండదు..’ అని అనురాగ్ గ్రూప్ విద్యాసంస్థల అధినేత రాజేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో అన్నారు.
‘ఇప్పటివరకు ఇక్కడే చదివిన విద్యార్థులతో నాలుగైదేళ్ల పాటు సీట్లు భర్తీ అయినా.. దీర్ఘకాలంలో ప్రభావం గణనీయంగా ఉంటుంది. కళాశాలల భవిష్యత్తు అంధకారమవుతుంది’ అని యాజమాన్య సంఘాల ప్రతినిధి కేవీకే రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలే కాకుండా ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కళాశాలల్లోనూ భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
50 వేల మంది విద్యార్థులు వెనక్కి..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఇంటర్మీడియెట్ కార్పొరేట్ కళాశాలలు ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రాంతం నుంచి విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లి దాదాపు 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం వారు తెలంగాణలో స్థానిక అభ్యర్థులుగా ఉండాలంటే ఇంటర్మీడియెట్‌ను ఈ రాష్ట్రంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ‘ఖమ్మం, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎక్కువగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు. వారంతా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర స్థానికులు కావడం కోసం వెంటనే వెనక్కి వచ్చే అవకాశం ఉంది.
అలాగే భవిష్యత్తులోనూ ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ చదువుకునే పరిస్థితి ఉండదు’ అని విద్యారంగ నిపుణులు పి.మధుసూదన్‌రెడ్డి చెపుతున్నారు. ‘సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో ఇంటర్ చదివే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరెట్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు తగ్గే అవకాశం ఉంటుంది..’ అని జేఈఈ శిక్షణ నిపుణులు కృష్ణచైతన్య చెప్పారు. రాష్ట్ర, రాష్ట్రేతర అభ్యర్థిగా మారడం అనేది ఇక్కడ ప్రధానంగా ప్రభావం చూపిస్తుందని ఆయన తెలిపారు.