
Photo Courtesy: BCCI
పంజాబ్ కింగ్స్ యువ క్రికెటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో బుధవారం నాటి మ్యాచ్ సందర్భంగా ప్రభ్‌సిమ్రన్ ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- పంజాబ్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఆతిథ్య సీఎస్‌కేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ధోని సేన 19.2 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సామ్ కరన్ (88), డెవాల్డ్ బ్రెవిస్ (32) మాత్రమే రాణించారు.
చెలరేగిన చహల్
ఇక పంజాబ్ బౌలర్లలో యజువేంద్ర చహల్ నాలుగు వికెట్ల (4/32)తో చెలరేగగా.. అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వారిలో అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించిన పంజాబ్ కాసేపటికే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి వన్‌డౌన్లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
దంచికొట్టిన ప్రభ్‌సిమ్రన్,శ్రేయస్
ప్రభ్‌సిమ్రన్ 36 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేయగా.. శ్రేయస్ 41 బంతుల్లో 72 రన్స్‌తో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు ఆఖర్లో శశాంక్ సింగ్ (12 బంతుల్లో 23) రాణించడంతో 19.4 ఓవర్లలో పని పూర్తి చేసిన పంజాబ్.. చెన్నైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో చెన్నై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ప్రస్తుతం టాప్-2లో ఉన్న పంజాబ్ తమ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది.
— Punjab Kings (@PunjabKingsIPL) April 30, 2025
ఇక ఈ మ్యాచ్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్న ప్రభ్‌సిమ్రన్.. ఐపీఎల్‌లో 1100 పరుగుల మైలురాయిని దాటేశాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 24 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నిలిచాడు.
కాగా 2019లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ప్రభ్‌సిమ్రన్.. ఇప్పటి వరకు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటికి 44 మ్యాచ్‌లలో కలిపి 1102 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
1. ప్రభ్‌సిమ్రన్ సింగ్ - 1102 పరుగులు
2. మనన్ వోహ్రా- 1083 పరుగులు
3. రాహుల్ తెవాటియా- 1063 పరుగులు
4. ఆయుశ్ బదోని- 886 పరుగులు
5. మన్వీందర్ బిస్లా- 798 పరుగులు.
చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని
Hat-trick 👌
Powerful start with the bat 🔥
Captain's knock 🫡
The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤
Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025