
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే చాలు ఏ రాష్ట్రానికైనా పార్శిల్ శ్రేష్టమైన ఉత్తమ జాతులు
అందుబాటులో 11 రకాల జాతులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ డీపీఆర్
తక్కువ ఖర్చుతో సగటు జీవికి పౌష్టికాహారాన్ని పళ్లెంలో నింపేవి కోడి మాంసం, గుడ్లు. అందుకే అవి ‘పూర్ మాన్స్ ప్రొటీన్’.
కోడి కూరతో రాగి సంగటి కలిపి ఆరగించి ఆనందించే వాళ్లు కొందరైతే.. బ్రేక్‌ఫాస్ట్‌లో కోడి కూరతో ఇడ్లీ ఆస్వాదించేవారు మరికొందరు. అది గ్రామమైనా, నగరమైనా.. నాటుకోడి కూర, బ్రౌన్ కోడి గుడ్లకు ఉన్న ఆదరణే వేరు. అలాంటి నాటు కోడి పిల్లలు, గుడ్లు మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. అవి మీ ఇంటికే వస్తే.. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని ‘కోళ్ల పరిశోధన సంచలనాలయం’ (ఐసీఎఆర్–డిపీఆర్).. ఇప్పుడు ఈ పని చేస్తోంది.
ప్రజలకు పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తేవటంతో పాటు, ఉపాధి అవకాశాలను సైతం అందించేది దేశీ ఉత్తమ జాతి కోళ్ల పెంపకం. ఈ కోళ్ల స్వచ్ఛతను కాపాడుతూనే, వాటిని మరింత మెరుగుపరచి దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తెస్తోంది హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని ‘కోళ్ల పరిశోధన సంచలనాలయం’ (ఐసీఎఆర్–డీపీఆర్). డీపీఆర్ శాస్త్రవేత్తల కృషితో.. మెరుగైన ఫలితాలనిచ్చే 11 రకాల నాణ్యమైన దేశీ ఉత్తమ కోళ్ల జాతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోళ్లకు చెందిన నాణ్యమైన కోడి పిల్లలను డీపీఆర్ రైతులకు విక్రయిస్తోంది. పొదిగే గుడ్లను కూడా అమ్ముతున్నారు. వీటిని కొనుక్కొని పిల్లలు పొదిగించుకొని, పెంచుకోవచ్చు.
యాంటీబయాటిక్స్ వాడకుండా..
ఈ సంస్థ అభివృద్ధి చేసిన వనరాజా, గ్రామప్రియ వంటి దేశీ జాతుల కోళ్లు దేశవ్యాప్తంగా ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. యాంటీబయాటిక్స్ వాడకుండా సమతుల్యమైన దాణాలు, మునగ ఆకు వంటివి మేపి చక్కని ఫలితాలు సాధించారు. వీరు రైతులకు అందుబాటులోకి తెస్తున్న ఉత్తమ కోళ్ల రకాల్లో ముఖ్యమైనవి.. శ్రీనిధి, జనప్రియ, కృషిలేయర్, కృషిబ్రో, వనశ్రీ, అసీల్, కడక్‌నాథ్, ఘాగస్, నికోబారీ.
మాంసం, గుడ్ల కోసం..
⇒ వనరాజా, శ్రీనిధి, జనప్రియ కోళ్లను మాంసం, గోధుమ రంగు గుడ్ల కోసం పెరట్లో పెంచుకోవచ్చు. ఔషధ విలువలున్న నల్ల కోడి కడక్‌నా«థ్‌ను నల్ల గుడ్లు, మాంసం కోసం పెంచుకోవచ్చు.
⇒ కృషిబ్రో మాంసం కోసం పెంచుకోదగిన కోళ్ల జాతి.
గుడ్ల కోసం.. గ్రామప్రియ, వనశ్రీ, అసీల్ కోళ్లను పెరట్లో పెంచుకోవచ్చు. కృషి లేయర్‌ను గుడ్ల కోసం వాణిజ్యపరంగా పెంచుకోవచ్చు.
వనరాజా, గ్రామప్రియలకు క్రేజ్
వనరాజా, గ్రామప్రియ దేశీయ కోళ్ల జాతులు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. వనరాజా రోగనిరోధక శక్తి కలిగిన జాతి. ఆరు నెలల్లో 2 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఏడాదికి 110 గుడ్లు పెడుతుంది. జత పెంచుకుంటే రూ.500 ఆదాయం వస్తుంది. ఇక గ్రామప్రియ జత కోళ్లు పెంచుకుంటే రూ.వెయ్యి ఆదాయం వస్తుంది. మా వద్ద నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రైతులు బుక్ చేసుకుంటారు.
ఇంటికే పార్సిల్
జాతిని బట్టి గుడ్డు ధర రూ. 9–23 మధ్య, పిల్ల ధర రూ. 22–120 వరకు ఉంటుంది. ముందుగా బుక్ చేసుకొని, నగదు చెల్లించిన వారికి ఏ రాష్ట్రానికైనా సరే, నేరుగా స్వస్థలాలకు పార్శిల్ పంపుతారు. బుకింగ్స్ రద్దీని బట్టి, బుక్ చేసుకున్న తర్వాత 1 నుంచి 3 నెలల్లో సరఫరా చేస్తున్నారు.