వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేందుకే చికిత్స అందిస్తున్నామని నిమ్స్ వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల వ్యవధిలోనే జగన్ రెండోసారి దీక్ష దిగడంతో అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం మందగించే అవకాశం ఉండటంతో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. గత రాత్రి పోలీసుల సాయంతో జగన్ కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు వైద్యులు తెలిపారు. కిటోన్ బాడీస్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇంకా రెండు రోజుల్లో జగన్ శరీరాన్నిసాధారణ స్థాయికి తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు జగన్ మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.