
మైదుకూరులో పట్టపగలే చోరీ
15తులాల బంగారు, రూ.10 వేలు అపహరణ
మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో గురువారం పట్టపగలే ఓ ఇంటిలో చోరీ జరిగింది. వేద వ్యాస హైస్కూల్ పక్కనే ఉన్న ములపాకు జంగంరెడ్డి చిన్న సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటిలో దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లెకు చెందిన చిన్న సుబ్బారెడ్డి ఆరేళ్ల కిందట మైదుకూరులో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెకు వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర చోట్ల ఉన్నారు. గురువారం చిన్న సుబ్బారెడ్డి భార్య మునెమ్మ వరి నాట్లకు వెళ్లగా, ఆయన గ్రామం వద్ద సాగు చేసిన పసుపు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దుండగులు.. ఇంటి ప్రధాన ద్వారం తాళాన్ని గడెలతో సహా పెకలించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో కుడి వైపున బెడ్ రూమ్‌లో ఉన్న బీరువా తలుపులను పగులగొట్టి అందులో ఉంచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న భార్యభర్తలు తలుపులు పగలగొట్టి ఉండటం చూసి.. ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు వస్తువులు, నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ సీఐ రమణారెడ్డి సిబ్బందితో కలిసి బాధితుల ఇంటికి చేరుకుని పరిశీలించారు. కడప నుంచి వేలి ముద్రల నిపుణులను పిలిపించారు. వారు ఇంటిలోని బీరువా, ఇతర వస్తువులపై పడిన వేలి ముద్రలను సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.