
నేడు ప్రైవేటు విద్యాసంస్థల బంద్
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి
కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ, సాయిబాబా విద్యా సంస్థల చైర్మన్ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై అధికారుల వేధింపులు అధికమయ్యాయన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలిపేందుకు గురువారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 55 శాతం విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యాబుద్ధులు నేర్పుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించి 4 లక్షలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. పేద వర్గాలకు సంబంధించి 25 శాతం పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ యాక్టు ఉన్నా అందులోని నిబంధనలు పూర్తి స్థాయిలో అధికారులు పాటించడం లేదన్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 90 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, అందులో సగం ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ యాక్టు అనేకచోట్ల దుర్వినియోగమవుతోందన్నారు. ఇలా అనేక సమస్యలతో నిర్వహిస్తున్న బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు గంగయ్య యాదవ్, శివశంకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇలియాస్ రెడ్డి, మైథిలి తదితరులు పాల్గొన్నారు.