
వేమన పద్యం ప్రాంతాలకు, భాషలకు అతీతమైంది
కడప ఎడ్యుకేషన్ : వేమన నిజమైన ప్రజాకవి అని, అందువల్లనే ఆయన పద్యం కులాలను దాటి, మతాలను దాటి, ప్రాంతాలను దాటి, భాషలను దాటి విస్తరించిందని తెలుగు భాషా సేవకులు స.వెం.రమేశ్ అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కడప సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో 144వ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘సజీవ సంప్రదాయంగా వేమన’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వేమన పద్యం ఏ భాషకూ లేనంత గొప్పతనాన్ని తెలుగు భాషకు కలిగించిందన్నారు. తమిళకవి తిరువళ్ళువర్‌తోనూ, కన్నడకవి సర్వజ్ఞునితోనూ వేమనను పోలుస్తుంటారని, సమాజంలో మంచిని పెంచి, చెడును తుంచే విషయంలో ఆ ముగ్గురికీ పోలిక ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ వీళ్లకన్నా వేమనే గొప్పవాడని అన్నారు. తెలుగువాళ్లు బతుకు పోరాటంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు వాళ్ల నోళ్లల్లో నానుతున్న వేమన పద్యాలు కూడా వాళ్లతోపాటు వెళ్లిపోయి తరాలు మారినప్పటికీ కాలానుగుణంగా వాళ్ల సంప్రదాయాల్లో కూడా నిలిచిపోయాయన్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని అంబలత్తాడియర్లు అనే ఆశ్రిత కులం వాళ్లు తమిళులైనప్పటికీ ధనుర్మాసంలో ఊరంతా తిరుగుతూ ‘వేమనానంద పదిగం’ అనే పేరుతో తెలుగులో వేమన పద్యాలను చెప్పడమే కాక, వేమనానందస్వామి తమ కులగురువని చెప్పుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు జి.శివారెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య మూలమల్లికార్జునరెడ్డి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్‌రావు, జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, విజయానందరెడ్డి, డాక్టర్ పెద్దిరెడ్డి నీలవేణి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాషా సేవకులు స.వెం.రమేశ్