
మానవత్వం చాటుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం సాయంత్రం పట్టణంలోని స్థానిక జేఎన్టీయూ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె నుంచి పాల ఆటో పులివెందులకు వస్తుండగా జేఎన్టీయూ సమీపంలోకి రాగానే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆ వ్యక్తిని ఆటో ఢీకొట్టి ఆటో పల్టీ పడింది. ఈ ప్రమాదంలో కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న క్రిష్ణంగారిపల్లెకు చెందిన షబానా, శంషాద్ అనే మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అదే ఆటోలో ప్రయాణిస్తున్న క్రిష్ణంగారి పల్లెకు చెందిన హనుమంత్ రెడ్డికి నడుము భాగంలో గాయం కావడంతో అతను లేవలేని స్థితిలో రోడ్డుపైనే పడిపోయాడు. ఆ సమయంలో అటువైపుగా పులివెందులకు వస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన కాన్వాయిని ఆపి కిందికి దిగి గాయాలపాలైన హనుమంత్ రెడ్డిని పరామర్శించి అప్పటికి అక్కడికి 108 వాహనం గాని చేరుకోకపోవడంతో తన సెక్యూరిటీ వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించాలని అనుచరులకు ఆదేశించారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెక్యూరిటీ వాహనంలో హుటాహుటిన గాయాలైన హనుమంత్ రెడ్డిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.