
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి
కడప సెవెన్‌రోడ్స్ : తమపై విపరీతంగా మోపిన పనిభారాన్ని తక్షణమే తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ శాఖకు లేని ఐవీఆర్‌ఎస్ పంచాయతీరాజ్‌శాఖకు విధించడం ఏమిటంటూ నిలదీశారు. పెరిగిన పనిభారాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కడప అంబేడ్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పంచాయతీ కార్యదర్శులు తరలివచ్చారు. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అన్వర్‌బాషా మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో తాము విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి పారిశుద్ధ్య పనులు మొదలుకొని గ్రామ, వార్డు సచివాలయ సర్వేలు, గూగుల్ మీటింగ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు, స్ప్రెడ్ షీట్, వివిధ యాప్స్‌లో ఫొటోలు, వీడియోలు అప్‌డేట్ చేయడం, ఇందుకోసం ప్రజల మొబైల్ ఫోన్ల నుంచి ఓటీపీలు సేకరించడం తదితర పనులు అప్పగిస్తున్నారని తెలిపారు. సత్వరమే ఐవీఆర్‌ఎస్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రీన్ అంబాసిడర్లు, క్లాప్ మిత్రలను పంచాయతీలకే అప్పగించి పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు కేవలం రూ. 6 వేలు మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తుండడంతో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఈ గౌరవ వేతనాలను గ్రామ పంచాయతీల గ్రాంట్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. చెక్‌పవర్ సర్పంచ్‌కు ఉన్నప్పటికీ వారి గౌరవ వేతనాలు చెల్లించడానికి పంచాయతీ కార్యదర్శులను ఒత్తిడికి గురిచేయడం తగదన్నారు. తమను గ్రామ పంచాయతీ విధుల నిర్వహణకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు. సమాఖ్య నాయకుడు సాయిప్రతాప్‌రెడ్డి, సునీల్, లక్ష్మినారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు నిధులు, మానవ వనరులను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల మూల వేతనం సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు జి.భాస్కర్, సీఎం గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన పని ఒత్తిడి
ఐవీఆర్‌ఎస్ రద్దు చేయాలి
సచివాలయ విధులు మాకొద్దు
ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా