
బయనపల్లెలో ఉద్రిక్తత
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని చింతపల్లె పంచాయతీ బయనపల్లె గ్రామంలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డికి చెందిన ఇంటిని అక్రమ నిర్మాణమంటూ కూల్చివేసేందుకు భారీగా పోలీసులను మోహరింపచేసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. అయితే గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అధికారుల తీరును తప్పుపట్టడంతో పాటు కూల్చివేతను అడ్డుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి సంబంధిత నాయకులతో మాట్లాడారు.
కూల్చివేతకు యత్నం..
బద్వేలు–కడప రహదారిలోని బయనపల్లె గ్రామంలో సర్వే నెం. 27ఎ, 27బిలలో కొంత గ్రామ నత్తం ఉంది. సదరు స్థలాన్ని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తాతల కాలం నుండి సుమారు 60 ఏళ్ల కిందటి నుండి 8 సెంట్ల స్థలాన్ని స్వాధీనానుభవంలో ఉంచుకున్నారు. సదరు స్థలం పక్కనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సీసీరోడ్లు సైతం నిర్మించారు. అయితే గత పదేళ్ల క్రితం శ్రీకాంత్‌రెడ్డి అందులో ఒక ఇంటిని నిర్మించుకుని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. ఇటీవల కాలంలో శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో పాటు రెండు రోజుల క్రితం జరిగిన యువతపోరు కార్యక్రమానికి బద్వేలు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున యువతను కడపకు తరలించారు. దీనిని జీర్ణించుకోలేని రూరల్ పరిధికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత వద్ద శ్రీకాంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్‌రెడ్డి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారు.
అడ్డుకున్న గ్రామస్థులు
టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతో శ్రీకాంత్‌రెడ్డి నివసిస్తున్న ఇంటిని కూల్చివేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు భారీగా పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల్లో చెరువును సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ముందు వాటిని తొలగించి తర్వాత ఇక్కడికి రావాలని అధికారులకు తేల్చిచెప్పారు. గ్రామస్థులు పెద్త ఎత్తున తరలిరావడంతో ఇంటిని కూల్చివేసే చర్యలు కొంతసేపు ఆపారు. ఇదే సమయంలో బద్వేలు రూరల్, బి.కోడూరు, అట్లూరు మండలాల నుండి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించడంతో పాటు అడ్డుకునే వారిపై నీళ్లు కొట్టేందుకు ఫైరింజన్‌ను సైతం పిలిపించారు. అయితే గ్రామస్థులు వారి చర్యలకు బెదరకుండా గట్టిగా నిలబడడంతో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడే కాపుకాశారు.
పరామర్శించిన ఎమ్మెల్సీ..
కక్షపూరిత చర్యల్లో భాగంగా వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు యత్నిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, మాజీ కుడా ఛైర్మన్ గురుమోహన్, జడ్పీటీసీ పోలిరెడ్డి తదితర నాయకులు పెద్ద ఎత్తున బయనపల్లెకు చేరుకున్నారు. ముందుగా మున్సిపల్ ఛైర్మన్ ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దారు ఉదయభాస్కర్ రాజు, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్‌లతో చర్చించి కొంత సమయం ఇచ్చి అక్రమ నిర్మాణమని తేలితే స్వచ్ఛందంగా తొలగించుకుంటామని తెలిపారు. ఇంతలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపటికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్సీ తహసీల్దారు, ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు అధికారులపై ఒత్తిడిని తీసుకువచ్చినట్లు తెలుస్తుందని అన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని
కూల్చివేసేందుకు యత్నించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
అడ్డుకున్న గ్రామస్తులు
పరామర్శించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

బయనపల్లెలో ఉద్రిక్తత