
టీడీపీలో కలవరం!
● వైఎస్ జగన్ సమక్షంలోపార్టీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం
● అన్నమయ్య జిల్లాలో ఇదే బాటలో మరికొందరు
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. పార్టీ అధిష్ఠానం కీలక నేతలను పట్టించుకోకపోవడం....పట్టున్న నేతలను విస్మరిస్తుండడం పరిస్థితి బట్టి చూస్తే భవిష్యత్తులో మరికొంతమంది టీడీపీ నేతలు వలసబాట పట్టనున్నారు. టీడీపీలో గట్టి పట్టున్న వారిని పట్టించుకోకపోవడం, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలనుప్రకటించకపోవడం, ప్రస్తుత సర్కార్‌లో అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా మిన్నకుండిపోతుండడం వంటి ఘటనలతో పార్టీలో సీనియర్ నాయకులు మనస్థాపం చెందుతున్నారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని.. పార్టీనే దైవంగా భావించిన వారికి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. కష్టపడి పనిచేసిన వారికి కాకుండా అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టీడీపీ అధిష్ఠానం పదవులు కట్టబెడుతుండడంపై కూడా పార్టీ లోని సీనియర్ నాయకులు రగలిపోతున్నారు. ప్రధానంగా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను టీడీపీ కరివేపాకులా వాడుకుని వదిలేసిందన్నది మెజార్టీ ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలోనే ఎన్ని అవమానాలకు గురిచేసినా పార్టీ అంటిపెట్టుకుని పనిచేసిన మాజీ జెడ్పీ చైర్మన్, టీడీపీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ దివంగత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యంను పార్టీ అధిష్టానం అవమానాలకు గురి చేయడంతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీలో కలవరం మొదలైంది.
రాజంపేట నుంచి పోటీ చేసినా
ఇన్‌ఛార్జి ఇవ్వని టీడీపీ
సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేశారు. పాలకొండ్రాయుడు కుటుంబం నుంచి రాయచోటికి అవకాశం పరిశీలించాలని పదేపదే అడిగినా కాదని, రాజంపేట నియోజకవర్గం అప్పగించారు. అయినా సుగవాసి బాలసుబ్రమణ్యం వెనుకంజ వేయకుండా రాజంపేట టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఏరు దాటకముందు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఎన్నికలకు ముందు ఒక తరహాలో, ఎన్నికలు తర్వాత మరో తరహాలో టీడీపీ అధిష్టానం వ్యవహరించడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఓడిపోయిన అభ్యర్థికి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇన్‌ఛార్జి పదవిని కట్టబెట్టకుండా నాన్చుడు ధోరణితో ముందుకు వెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా మరోపక్క ఇంకో నాయకుడిని అదే నియోజకవర్గంలో ప్రోత్సహించడం వెనుక పొమ్మనకుండానే పొగబెట్టినట్లు అర్థమవుతోంది. ఎన్నికల సందర్భంగా భారీగా ఖర్చు చేసుకుని పార్టీ కోసం అన్ని విధాల అగచాట్లు పడిన వారిని కాదని, ఇతరులను ప్రోత్సహించడంపై తెలుగు తమ్ముళ్లలో చర్చకు దారి తీసింది. అవమానాలు ఎదుర్కొంటూ...పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న సుగవాసిని టీడీపీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది.
● రాయచోటిలో ‘సుగవాసి’ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎంపీ, దివంగత సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి నమ్ముకునే పాలకొండ్రాయుడు కుటుంబం రాజకీయాలు చేసింది. అంతేకాకుండా రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లెలో కూడా సుగవాసి కుటుంబాన్ని అభిమానిస్తూ వారి వెంట నడుస్తున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఇలా వివిధ హోదాల్లో పనిచేసి పార్టీకోసం అహర్నిశలు కష్టపడిన పాలకొండ్రాయుడిని చివరి గడియల్లో కూడా అధిష్ఠానం పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో ఆరోగ్యం సహకరించకపోయినా టీడీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేసిన పాలకొండ్రాయుడు ఇటీవల మృతి చెందినంతరం కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీలో ప్రధాన నేతలు రాకపోవడం, మహానాడు కార్యక్రమంలో సంతాపాన్ని తెలియజేయకపోవడం అభిమానులతోపాటు కుటుంబంలోనూ బాధను నింపింది. అంతేకాకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన పాలకొండ్రాయుడు కుటుంబాన్ని అధోగతిపాలు చేసేలా అధిష్ఠానం తీసుకున్న చర్యలపై సుగవాసి బాలసుబ్రమణ్యం కినుకు వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సంబేపల్లెకు వచ్చిన సందర్భంలోనూ, ఒంటిమిట్ట కల్యాణం సందర్భంలోనూ, ఇతర సందర్భాల్లోనూ బాలసుబ్రమణ్యంకు అవకాశం ఇవ్వకుండా చేయడంపై కుటుంబంలో కలకలం రేగింది. ఈ నేపధ్యంలో పొమ్మనకుండానే పొగబెడుతున్న అధిష్టానం తీరు నచ్చక సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.