
పదోన్నతులు కల్పించాకే బదిలీలు నిర్వహించాలి
కడప కార్పొరేషన్ : పదోన్నతులు కల్పించిన తర్వాతే సచివాలయ ఉద్యోగులకు బదిలీలు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఽవారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండానే వివిధ సచివాలయాలకు డిప్యుటేషన్లు వేశారని, ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు తెరిచిన నేపథ్యంలో వేరే మండలాలకు, మున్సిపాలిటీలకు బదిలీలు చేస్తే తమ పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వారు విధుల్లో చేరినప్పటినుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, స్థానిక మండలం, స్థానిక మున్సిపాలిటీల్లోనే బదిలీలు కల్పించాలన్నారు. గుర్తింపు పొందిన అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలన్నారు. రేషనలైజేషన్ తర్వాత మిగిలిన ఉద్యోగులను ఎక్కడ సర్దుబాటు చేస్తారో చెప్పాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు ఇస్తున్న విధంగా డీఏలు, పీఆర్‌సీ సచివాలయ ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు.
సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు మేయర్ మద్దతు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు మేయర్ సురేష్ బాబు మద్దతు తెలిపారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆయన వారికి సంఘీభావంగా ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక మండలాలు, మున్సిపాలిటీల్లోనే వారిని బదిలీ చేయాలని కోరారు. భవిష్యత్‌లో వారి పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల డిమాండ్

పదోన్నతులు కల్పించాకే బదిలీలు నిర్వహించాలి