
మద్యం మత్తులో చెలరేగిపోయిన యువకులు
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల పట్టణం కడప రహదారిలో యువకులు మద్యం తాగి కత్తులు, రాడ్‌లతో చెలరేగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి గ్రామానికి చెందిన కొంత మంది యువకులు ప్రత్యేక వాహనంలో ఎర్రగుంట్లకు వచ్చి కడప రహదారిలో ఉన్న మద్యం షాపులో మద్యం తాగారు. బయటికి వచ్చిన తర్వాత ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన యువకులతో గొడవకు దిగారు. దీంతో చాగలమర్రికి చెందిన యువకులు కారులో ఉన్న రాడ్లు, కత్తులను బయటికి తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
బంగారు నగలు అపహరణ
జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని పాతబస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 6 తులాల బంగారు చోరీ జరిగినట్లు ఎస్‌ఐ హైమావతి తెలిపారు. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రవళ్లిక తన భర్తతో కలసి స్వగ్రామమైన పెద్దముడియం మండలం జంగాలపల్లె గ్రామానికి వెళ్లేందుకు జమ్మలమడుగు బస్టాండ్‌కు వచ్చింది. కొద్ది సేపటికి బస్సు రావడంతో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని భర్తతో కలసి బస్సు ఎక్కింది. కాసేపటి తర్వాత బ్యాగ్ చూసుకోగా అందులో బంగారు నగలు ఉన్న చిన్న బ్యాగ్ కనిపించలేదు. వెంటనే భర్తతో కలసి జమ్మలమడుగు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలు బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు తెలిసింది.