చక్రాయపేట : మండలంలోని మారెళ్లమడక గ్రామంలోని గండి వీరాంజనేయస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు ద్వారా రూ.9,07,554 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. గండి వీరాంజనేయస్వామి క్షేత్రంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.9,07,554ల నగదు, 005.00గ్రాముల బంగారు, 320.00 గ్రాముల వెండి, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.14,407ల ఆదాయం వచ్చిందన్నారు. మధ్యాహ్నం బహిరంగ వేలం ద్వారా ఆలయంలో పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా వేంపల్లెకు చెందిన సుధీర్ దక్కించుకున్నారన్నారు. దేవస్థాన భూములు, షాపింగ్ కాంప్లెక్స్ గదుల లీజు హక్కులకు, ఖాళీ నెయ్యి డబ్బాలు, నిరూపయోగ వస్తువుల విక్రయాలు, కూరగాయల సరఫరా హక్కులకు ఎవరూ డిపాజిట్ కట్టి పాల్గొనకపోవడంతో వాయిదా పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, దేవస్థాన చైర్మన్ కావలి కృష్ణ, బోర్డు సభ్యులు, ఏపీజీబీ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.