బొలేరో ఢీకొని ముగ్గురికి గాయాలు
చివ్వెంల(సూర్యాపేట) : అతివేగంగా వస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మండల కేంద్రం శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ నుంచి ఖమ్మం పట్టణానికి ఇంటి సామగ్రి లోడ్ కోసం వెళ్తున్న బొలేరో వాహనం.. చివ్వెంల మండల కేంద్రం శివారులో మోతె మండలం మామిళ్లగూడెం గ్రామం నుంచి సూర్యాపేటకు వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. అనంతరం రహదారిపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ప్రయాణిస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన రవి, మహేష్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తల, కాళ్లకు గాయాలయ్యాయి. అదే సమయంలో చివ్వెంల మండల కేంద్రంలో ఎన్నికల నామినేషన్లను పరిశీలించి సూర్యాపేటకు వెళ్తున్న ఎస్పీ నరసింహ సంఘటనను చూసి ఆగారు. రహదారిపై పడిఉన్న వాహనాన్ని స్వయంగా సిబ్బందితో కలిసి పక్కకు తీయించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ మహేశ్వర్‌ను వివరణ కోరగా.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.


