‘అయాన్’ పై రైతుల ఆసక్తి
నల్లగొండ అగ్రికల్చర్ : పంటకాలం ఎక్కువగా ఉండడంతోపాటు వాతావరణ పరిస్థితులను తట్టుకోలేకపోవడం.. చీడపీడల బారిన పడడం వల్ల గతంలో రైతులు సన్నరకం ధాన్యం సాగుపై పెద్దగా దృష్టి సారించలేదు. అయితే దశాబ్ద కాలంగా తక్కువ పంటకాలం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక దిగుబడి సాధించే బ్రీడెడ్ సన్నరకం వైరెటీలను ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వీటిని సాగుచేస్తున్న రైతులకు అధిక దిగుబడులతోపాటు మంచి లాభాలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 5.70 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి ధాన్యం సాగయ్యింది. ప్రధానంగా ప్రభుత్వ వైరెటీలైన బీపీటీ–5204 స్వర్ణమసూరి, తెలంగాణ సోనా, సాంబ లాంటి విత్తనాలతోపాటు జీనెక్స్ సీడ్స్‌కు చెందిన ఆయాన్–2025 వైరెటీ విత్తనాలను రైతులు భారీగా సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వంగడాలు భారీ దిగుబడి రావడంతోపాటు బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయాన్–2025పై రైతుల ఆసక్తి
రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అనేక కంపెనీలు మేలు రకమైన వంగడాలు మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ప్రధానంగా జీనెక్స్ సీడ్స్ కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చిన అయాన్–2025 అనే ఫైన్ వైరెటీ సీడ్ చీడపీడలను తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడి ఇస్తున్న నేపథ్యంలో రైతులు ఈ రకం వరిని అధికంగా సాగు చేస్తున్నారు. 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికొస్తున్న ఈ రకం వరి ఎకరానికి 55 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది. ఎక్కువ పిలకలు రావడం.. తక్కువ ఎత్తు పెరగడం.. మొక్క కాండం ధృడంగా ఉండడంతో గాలి వానకు కూడా కింద పడడం లేదని రైతులు అంటున్నారు. రైస్‌లో ఆయిల్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలు, దేశాల్లో భారీ డిమాండ్ ఏర్పడడంతో అక్కడికి సైతం ఎగుమతి చేస్తున్నామని మిల్లర్లు చెబుతున్నారు. సన్న ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.500 బోనస్ రావడంతో రైతులు సన్నధాన్యం సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రతికూల వాతావరణాన్ని
తట్టుకుంటున్న ఫైన్ వైరెటీ వంగడాలు
అధిక దిగుబడి ఇస్తున్న
అయాన్–2025 రకం
ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు
సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు


