ఆదర్శం.. రేణికుంట పంచాయతీ
రాజాపేట : ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రేణికుంట గ్రామం రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని రేణిగుంట గ్రామానికి సర్పంచ్‌గా ఉన్న బూరు భాగ్యమ్మానర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం, స్వచ్ఛ సర్వేక్షణ్, పల్లె ప్రగతి పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేశారు.
జాతీయ అవార్డులు
రేణికుంట గ్రామానికి 19 జూన్ 2023న రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించింది. మౌళిక వసతుల కల్పన, స్వయం సమృద్ధి విభాగంలో 2021–2022లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గానూ జాతీయ పంచాయతీ అవార్డు లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఇంకుడు గుంతలు, సేంద్రియ ఎరువుల తయారి, పల్లె ప్రగతి కార్యక్రమం సమగ్రంగా అమలు చేసినందుకు 26 జనవరి 2020లో జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించింది.
అభివృద్ధి పనులు
గ్రామంలో ప్రతి కాలనీలో 80 లక్షల నిధులతో సీసీ రోడ్లు వేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి ఎదుట, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడంతో వాటిని 100 శాతం బతికించారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతీ కాలనీలో, రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు రేణిగుంట నుంచి, రాజాపేట వరకు లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామానికి కొత్త కళ వచ్చింది. కొత్త హంగులతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడంతో పాటు శిథిలావస్థకు చేరిన పాఠశాలను ఆధునీకరించి గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీగా ఎంపిక
హరితహారం, స్వచ్ఛ భారత్ మిషన్,
పల్లె ప్రగతి నిర్వహణలో జాతీయ అవార్డు
ఆదర్శం.. రేణికుంట పంచాయతీ


