గ్రామ శివారుకు తరలిన మద్యం దుకాణాలు
మునుగోడు : ఎంతో కాలంగా నల్లగొండ జిల్లా మునుగోడులోని ప్రధాన కూడలిలో కొనసాగుతున్న మద్యం దుకాణాలు గ్రామ శివారుకు తరలాయి. మద్యం దుకాణాలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు ఎన్నో రోజులుగా కోరుతూ వస్తున్నారు. దీనికితోడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మద్యం దుకాణాలు గ్రామ శివారుల్లో ఏర్పాటుచేయాలని, అలాగే సిట్టింగ్ అనుమతి కూడా ఉండొద్దని నెలరోజు క్రితం ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న యజమానులతో సమావేశమై మద్యం విక్రయాలపై పలు ఆంక్షలు విధించారు. దీంతో యజమానులంతా గ్రామ శివారులో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి సోమవారం ప్రారంభించారు. మునుగోడులో మొత్తం నాలుగు దుకాణాలు ఉండగా నల్లగొండ రోడ్డులో ఒకటి, చండూరు రోడ్డులో మరొకటి, చౌటుప్పల్ రోడ్డులో ఇంకొకటి ప్రారంభించారు. నాలుగోది ఇంకా ప్రారంభించలేదు.
పల్లెపహాడ్ గ్రామంలో విషాదం
తుర్కపల్లి: తుర్కపల్లి మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పల్లెపహాడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ (మహిళ) రిజర్వ్ అయ్యింది. కాగా గ్రామానికి చెందిన పంగాల బాలరాజ్ భార్య పంగాల చంద్రకళను గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటూ గ్రామస్తులు ప్రోత్సహించారు. దీంతో ఆమె నామినేషన్ దాఖలు చేసింది. అయితే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో బాలరాజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఽతెలిపారు. బాలరాజు మరణంపై గ్రామస్తులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


