గేటు పడితే.. గుండెల్లో రైళ్లు
ఓ రైలు వెళ్లగానే మరొకటి వస్తుంది
ఎమ్మెల్యే చొరవ చూపాలి
ఆలేరురూరల్ : గుండ్లగూడెం రైల్వే గేటు మీదుగా వెళ్లాలంటేనే ప్రయాణికులు అమ్మో అంటూ భయపడే పరిస్థితి నెలకొంది. గేటు పడితే ఎండైనా.. వానొచ్చినా.. అరగంట పైగా వేచి ఉండాల్సిందే.. నాలుగైదు రైళ్లు వెళ్లే వరకూ గేటు తీయకపోవడంతో 30 నిమిషాల పాటు నిలిచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఏళ్లతరబడి ఇదే సమస్య నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైల్వేగేటు స్థానంలో అండర్‌పాస్, లేదా ఫ్లయ్ ఓవర్ నిర్మించి సమస్య పరిష్కరించాలని గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్‌గూడెం, శ్రీనివాస్‌పురంతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
150 వరకు రైళ్ల రాకపోకలు
ఆలేరు పట్టణ పరిధిలో సుమారు 7 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో సికింద్రాబాద్–ఖాజీపేట, నాందేడ్, సిర్పూర్ ఖాగజ్‌నగర్, ముంబయి, ఢిల్లీ వైపు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు కలిపి రోజూ 100 నుంచి 150 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్యాసింజర్ రైలు వచ్చిన ప్రతీసారి 5 నుంచి 10 నిమిషాలు గేట్ పడుతుంది. అదే గూడ్స్ రైలు వస్తే కనీసం 15 నిమిషాలు గేట్ వేస్తున్నారు. రైలు వెళ్లాక గేటు ఎత్తాలంటే మరో 10 నిమిషాలైనా వేచి ఉండాలి. దీంతో కాలినడకన ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదొక్కటే మార్గం
గుండ్లగూడెం, శివలాల్‌తండా, పటేల్‌గూడెం, శ్రీనివాస్‌పురంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే గుండ్లగూడెం రైల్వే గేట్ మీదుగా ఉన్న మార్గం ఒక్కటే. వారంతా ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు.. ఇలా వివిధ పనుల నిమిత్తం ఆలేరు, భువనగిరి తదితర ప్రాంతాలకు వెళ్లొస్తుంటారు. వందల సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్తుంటారు. రైలు వచ్చిన ప్రతీసారి ఐదు నిమిషాల ముందే గేట్ పడుతుండటంతో యాతన పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అంబులెన్స్ వచ్చినా ఆగాల్సిందే. అత్యవసరం ఉంటే 12 కిలో మీటర్లు జనగాం అయినా వెళ్లాలి, లేదా చుట్టూ 8 కిలో మీటర్ల తిరిగి ఆలేరుకు రావాలి.
రైల్వే గేట్ దాటడానికి ప్రజ లు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం, ఓ రైలు పోతుందనుకుంటే మరొకటి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అరగంట వరకు నిలబడాల్సి వస్తుంది. కొందరు గేటు దాటే ప్రయత్నంలో ప్రాణాలు పోగోట్టుకున్నారు. ఇప్పటికైనా అండర్‌పాస్ నిర్మించాలి. – బండ జహంగీర్,
పటేల్‌గూడెం, ఆలేరు మండలం
గుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద నిత్యం నరకం
ఫ ఇరువైపులా భారీగా
నిలిచిపోతున్న వాహనాలు
ఫ ఇబ్బందులు పడుతున్న
ప్రజలు, ప్రయాణికులు
ఫ సాకారం కాని అండర్‌పాస్ కల
గతం కంటే రైళ్ల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రైళ్లు, గూడ్సు రైళ్లు కలిపి రోజూ వందకు పైనే పోతుంటాయి. అరగంటకోసారి గేటు పడుతుండటంతో వివిధ పనులు నిమిత్తం ఆలేరు, జనగామ, భువనగిరికి వివిధ పనులకు వెళ్లేవారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే చొరవ చూపితే సమస్య తీరుతుంది.
– ఏసీరెడ్డి. మహేందర్‌రెడ్డి,
గుండ్లగూడెం మాజీ సర్పంచ్
దీక్షలు, నిరసనలు
గుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద అండర్‌పాస్ లేదా ఫ్లై ఓవర్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇటీవల బీజేపీ నాయకులు ఆలేరులో రిలే నిరాహర దీక్ష చేయగా.. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వచ్చి ఆరు నెలల్లో అండర్‌పాస్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
గేటు పడితే.. గుండెల్లో రైళ్లు
గేటు పడితే.. గుండెల్లో రైళ్లు
గేటు పడితే.. గుండెల్లో రైళ్లు


