శ్రీకాంతాచారి వర్ధంతికి తరలిరావాలి
మోత్కూరు : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ తలపెట్టిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామరోజు వీరాచారి తెలిపారు. ఆదివారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి ప్రాణాలర్పించడం వల్లే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందన్నారు. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. వర్ధంతి కార్యక్రమానికి ఉద్యమకారులు పెద్దసంఖ్యలో తరలివచ్చి శ్రీకాంతాచారికి నివాళులర్పించాలని కోరారు. జిల్లాలోనే శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
టెట్ నుంచి
మినహాయింపు ఇవ్వాలి
భువనగిరి : 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాయకులు డిమాండ్ చేశారు. తపస్ జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమ ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండేళ్లలో టెట్ పాస్ కావాలనే నిబంధన పెట్టడం సమంజసం కాదన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టెట్‌పై ప్రస్తావించాలని వారు ఎంపీని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట, రాజా పేట, తుర్కపల్లి మండలాల అధ్యక్షులు సైదారావు, జానయ్య, మంజుల ఉన్నారు.
నేటి నుంచి కొత్త వైన్స్‌లు
సాక్షి యాదాద్రి : నూతన మద్యం పాలసీ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. రెండేళ్లకాల పరిమితితో జిల్లాలో 84 మద్యం షాపులను డ్రా పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. పాత దుకాణాలకు నవంబర్ 30వ తేదీతో గడువు పూర్తి కావడంతో నేటి నుంచి కొత్త వైన్స్‌లు తెరుచుకోనున్నాయి. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు అవసరమైన సర్టిఫికెట్‌లను ఎకై ్సజ్ అధికారులకు సమర్పించి మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు లైసెన్స్ పొందారు. పాత వైన్స్‌లు నిర్వహించిన చోటే కొత్తవాటి ఏర్పాటుకు వ్యాపారులు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వేరే చోటుకు మారాయి.


