టికెట్ వస్తే ఓకే.. లేదంటే జంప్!
ఇటీవల పార్టీలు మారిన నేతలు..
సాక్షి, యాదాద్రి : పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న నేతల నేతల సంఖ్య పెరిగిపోతోంది.టికెట్ రాలేదని కొందరు, భవిష్యత్ కోసం ఇంకొందరు, సొంత పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులతో మరికొందరు.. ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ప్రధాన పార్టీల్లో ఎక్కువగా ఉంది. ముందస్తు హామీ తీసుకొని పార్టీ మారిపోతున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో పోటీ అధికం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో పార్టీ నుంచి కనీసం ఐదారుగురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో సానుభూతిపరులు సైతం టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ దక్కని వారు పార్టీతో నిమిత్తం లేకుండా నామినేషన్ వేస్తున్నారు. వార్డు స్థానాలకు సైతం తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్‌గా బరిలో నిలవాలనుకున్న నాయకులు చాలా చోట్ల రిజర్వేషన్లు అనుకూలించలేదు. దీంతో వారు ఉప సర్పంచ్ పదవులపై కన్నేసి బరిలోకి దిగుతున్నారు.
భవిష్యత్‌పై ముందుగా భరోసా ఇస్తేనే..
పార్టీలు మారే నాయకులు తమ రాజకీయ భవిష్యత్‌పై ముందే భరోసా తీసుకుంటున్నారు. తమకు ఇచ్చే ఆఫర్లను బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు.
బొమ్మలరామారం మేజర్ గ్రామ పంచా యతీ స్థానానికి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గుర్రాల లక్ష్మారెడ్డి మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు మరి కొందరు నాయకులు టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో లక్ష్మారెడ్డి తన అనుచరులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
యాదగిరిగుట్ట మండలం సైదాపురం సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వుడ్ అయ్యింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పులేపాక లావణ్యశ్రీనివాస్, మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ రాదని తేలిపోవడంతో పార్టీని వీడారు. తమ అనుచరులతో కలిసి డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడిమహేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన పాలసంఘం చైర్మన్, కాంగ్రెపా ర్టీకి చెందిన సీనియర్ నాయకుడు పయ్యావుల ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి శుక్రవారం బీఆర్‌ఎస్ గూటికి చేరారు.
ఆలేరు మండలం మంతపురిలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సతీష్‌రెడ్డి ఎంతోకాలంగా సర్పంచ్ టికెట్ ఆశిస్తున్నాడు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకు న్న కొరుటూరి భిక్షపతికి నిరాశే మిగిలింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టికెట్‌ల లొల్లి
ఫ బీసీ, జనరల్ స్థానాల్లో తీవ్ర పోటీ
ఫ ఒక్కో పార్టీ నుంచి ఐదారుగురు ఆశావహులు
ఫ టికెట్ దక్కని నాయకుల్లో తీవ్ర అసంతృప్తి
ఫ అనుచరులతో కలిసి పార్టీ మార్పు
టికెట్ వస్తే ఓకే.. లేదంటే జంప్!


