ఏకగ్రీవాలకు అందని నజరానా
సాక్షి యాదాద్రి: సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వ పరంగా రూ.10 లక్షలు చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు ఆప్పటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రూ.15లక్షలు, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆ ఫండ్ వస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఆశతో కలిసికట్టుగా 59 పంచాయతీలను జనం ఏకగ్రీవం చేసుకున్నారు. పాలకవర్గాల పదవీకాలం ముగిసి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క పంచాయతీకి పైసా నిధులు రాలేదు.
ఏకగ్రీవంపై గ్రామాల్లో చర్చ
తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 427 సర్పంచ్‌లు, 3,826 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. శనివారం(నేడు)తో తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఏకగ్రీవాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏకగ్రీవం కోసం ఆశావహులు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వ్యక్తిగత మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకగ్రీవంపై గ్రామాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
మంత్రి వెంకట్‌రెడ్డి ప్రకటనతో ఆశలు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షల నజారానా ప్రకటించడం యాదాద్రి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీలను ఏకగ్రీవం చేయుటకు కసరత్తు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ 2019 ఎన్నికల్లో 59 పంచాయతీలు ఏకగ్రీవం
ఫ ఈసారైనా నజరానా అందేనా?


