ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర కీలకం
భూదాన్‌పోచంపల్లి: ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ల (పీఓ) పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పీఓలు, ఓపీఓలకు స్థానిక ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్‌కు సన్నద్ధత, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు తదితర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తారని, అందువల్లనే ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందన్నారు.పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం , సీల్ వేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని పలుమార్లు సరి చూసుకోవాలని పేర్కొన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుడికి రెండు ఓట్లు వేయాల్సి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకు ముందు జూలూరులో ధాన్యం కొనుగోళ్లన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఓ ప్రభాకర్, సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి, పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


