వార్డు సభ్యుడి నుంచి..మండలి చైర్మన్‌గా
చిట్యాల: చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అలాంటిది గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అనంతర కాలంలో పార్లమెంట్ సభ్యుడుగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా అంచెలంచెలుగా ఎదిగారు చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి.
గుత్తా ప్రస్థానం ఇలా..
గుత్తా సుఖేందర్‌రెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1981లో ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1984లో చిట్యాల వ్వవసాయ మార్కెట్ వైస్ చైర్మన్‌గా నామినేట్ అయ్యారు. 1985లో మార్కెట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1992లో చిట్యాల సింగిల్ విండో చైర్మన్‌గా గెలుపొందారు. 1992–99 వరకు వరుసగా ఉరుమడ్ల గ్రామ పాలఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌గా ఎన్నికై నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల యూనియన్ చైర్మన్‌గా పనిచేశారు. 1995–99 వరకు ఏపీ డెయిరీ చైర్మన్‌గా పనిచేస్తూనే నేషనల్ డెయిరీ బోర్డు సభ్యుడుగానూ కొనసాగారు. 1995లో దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు.
ఎంపీ, ఎమ్మెల్సీగా..
1999లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో, 2014లో నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు. 2018 నుంచి 2019 వరకు క్యాబినేట్ హోదాలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. మొదటిసారిగా 2019–21 వరకు ఎమ్మెల్సీగా వరకు పనిచేశారు. రెండోసారి 2021న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 నుంచి రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఇలా గుత్తా సుఖేందర్‌రెడ్డి గ్రామస్థాయి నుంచి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగారు.


