బంగారు బ్రాస్‌లెట్ అప్పగింత
మునగాల: పెట్రోల్ బంక్‌లో బంగారు బ్రాస్‌లెట్ పోగొట్టుకున్న వ్యక్తికి ఆ ఆభరణాన్ని బంక్ యజమాని తిరిగి అతడికి అందజేశారు. మునగాల మండల కేంద్రం శివారులో గల భారత్ పెట్రోల్ బంక్‌లో ఓ వినియోగదారుడు ఈనెల 21న రాత్రి తన కారులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చి తన చేతికి ఉన్న బంగారు బ్రాస్‌లెట్ పోగొట్టుకున్నాడు. బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన గోవింద లింగరాజుకు బ్రాస్‌లెట్ లభించడంతో దానిని బంక్ సిబ్బందికి అందించి పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయాలని తెలిపాడు. ఈక్రమంలో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ఓ వ్యక్తి చూసి బ్రాస్‌లెట్ పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెనబోయిన రాంబాబుకు తెలిపాడు. రాంబాబు ఆభరణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, బంక్‌లో డీజిల్‌కు సంబంధించిన బిల్లులు బంక్ యాజమాన్యానికి పంపించడంతో అన్నీ పరిశీలించి గురువారం రాత్రి రాంబాబు, నాగమణి దంపతులకు బంక్ యజమాని హిమబిందు బ్రాస్‌లెట్ అందజేశారు.
రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి
నల్లగొండ, చిట్యాల : చిట్యాల–రామన్నపేట రైల్వే స్టేషన్ల మధ్యలో గురువారం రైల్లో నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతిచెందినట్లు నల్లగొండ రైల్వే ఎస్‌ఐ బి. రామకృష్ణ పేర్కొన్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50ఏళ్ల మద్యలో ఉంటుందని రైల్వే ఎస్‌ఐ తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడు తెల్లటి గడ్డంతో పాటు స్వచ్ఛ భారత్ అని ఇంగ్లిష్‌లో రాసి ఉన్న వైట్ టీషర్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. నల్లగొండ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, మృతుడి వివరాలు తెలిస్తే 87126 58595ను సంప్రదించాలని సూచించారు.


