వడ్డీ వచ్చేసింది
● 2025–26కు సంబంధించి పొదుపు
సంఘాల ఖాతాల్లో రూ.18.02కోట్లు జమ
రామన్నపేట: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,032 సంఘాలకు రూ.18.02కోట్ల వడ్డీ సొమ్మును విడుదల చేసింది. జిల్లాలో 14,956 సమభావనా సంఘాలు, 562 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. 1,55,359 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో రెండు దఫాలుగా వడ్డీ సొమ్మును విడుదల చేసింది. మొదటి దఫాలో 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను 11,676 సంఘాలకు రూ.8.68కోట్ల నిధులు, 2024–25కు సంబంధించి 11,676 సంఘాలకు రూ.12.40కోట్లు విడుదల చేసి మహిళా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,032 సంఘాలకు రూ.18.02కోట్ల వడ్డీ సొమ్మును విడుదల చేసింది. మొత్తం మూడు విడతలుగా రూ.41.42కోట్ల వడ్డీ డబ్బులను ప్రభుత్వం మహిళల పొదుపు ఖాతాల్లో జమ చేసింది.


