రైతులపై హమాలీ భారం
హమాలీ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలి
రామన్నపేట: ప్రతి ఏటా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నా రైతులకు హమాలీ చార్జీలు మాత్రం ఇవ్వడం లేదు. హమాలీ ఖర్చుల కింద క్వింటాకు రూ.5.20 చొప్పున చెల్లించాల్సి ఉన్నా ఆరేళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో హమాలీ చార్జీలు రైతులకు భారంగా మారాయి.
2017 వరకు అమలు..
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి రైతులు పండించిన ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కొనుగోలు బాధ్యతను మహిళా సంఘాలు, పీఏసీఎస్‌లకు అప్పగించి ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు (ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేశారు. కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ ఇచ్చేవారు. హమాలీ చార్జీలతో కొంత భాగం ప్రభుత్వమే భరించేది. 2017 వరకు ప్రభుత్వం క్వింటాకు రూ 5.30లు చెల్లించింది. ఆ తరువాత చెల్లించకపోవడంతో అప్పటి నుంచి రైతులే హమాలీ ఖర్చులు భరిస్తున్నారు.
క్వింటాకు రూ.40 చొప్పున చెల్లింపు..
జిల్లాలో ప్రతి సీజన్‌లో సరాసరి 2.80 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. 6లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. రైతుల కుటుంబ అవసరాలు, విత్తనాలకు పోగా మిగిలిన 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం పీపీసీల ద్వారా కొనుగోలు చేస్తుంది. పీపీసీ సెంటర్ల ప్రారంభంలో క్వింటాకు రూ.20 హమాలీ చార్జీ ఉండేది. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులే చెల్లించేవారు. ప్రభుత్వం తరువాత వారి ఖాతాల్లో రూ 5.30 జమచేసేది. 2017లో వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఆ తరువాత ప్రభుత్వం హమాలీ చార్జీల చెల్లింపుపై చేతులేత్తేసింది. ప్రస్తుతం హమాలీ చార్జీలు రెట్టింపయ్యాయి. క్వింటాకు రూ.40 చొప్పున రైతులు హమాలీ చార్జీలు చెల్లిస్తున్నారు. పీపీసీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులోలేని గ్రామాల్లో ప్రైవేటు స్థలాలను తీసుకొని అద్దె చెల్లిస్తున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చును రైతులు క్వింటాకు రూ.2 నుంచి రూ.3 భరిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలోని రైతులపై ప్రతి సీజన్‌కు రూ.14 కోట్ల భారం పడుతోంది.
ఆరేళ్లుగా రైతులకు చెల్లించని
హమాలీ చార్జీలు
ప్రతి సీజన్‌లో రూ.14 కోట్ల భారం
హమాలీ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రూ 2,380లో రూ 40లు హమాలీ చార్జీలకే పోతుంది. గ్రామాల్లో ధాన్యం ఆరబెట్టడానికి, తడవకుండా కాపాడడానికి టార్పాలిన్ కవర్లును రైతులు అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. హమాలీ చార్జీలతోపాటు అదనపు ఖర్చులు రైతులపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– అశోక్‌రెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
రైతులపై హమాలీ భారం


