ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి పూర్తయ్యాక తిరిగి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
భువనగిరిటౌన్ : 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఎస్సీ ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకుగాను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హనుమంతరావు 1100 స్వెటర్లు, 1300 బ్లాంకెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సాహితి తదితరులున్నారు.
క్షేత్రపాలకుడికి
నాగవళ్లి దళార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరం పాటు పాలతో అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఇక శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.
త్వరలో సిటీ స్కాన్ సేవలు
భువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈమేరకు మిషన్‌ను వైద్యులు మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో సిటీ స్కాన్ లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది. రోగులకు ఉచితంగా సిటీ స్కాన్ సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మూడు నెలల క్రితం జిల్లా కేంద్ర ఆస్పత్రికి సిటీ స్కాన్ మిషన్‌ను మంజూరు చేసింది. ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానుండడంతో రోగులకు ఎంతో మేలు కానుంది. ప్రస్తుతం ఈ సిటీ స్కాన్ మిషన్‌ను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను భువనగిరి ఏఎస్పీ రాహుల్‌రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో సబ్ ఇన్‌స్పెక్టర్ బుగ్గ శ్రీశైలం పనితీరును అభినందించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించడంతో పాటు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారని కొనియాడారు. బెల్ట్ షాపుల నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణ, చోరీలను తగ్గించడం, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అవగాహన కల్పించడంపై ఎస్సై, సిబ్బందిని అభినందించారు. అనంతరం మండల కేంద్రంలో బైక్‌పై పెట్రోలింగ్ నిర్వహించారు. భువనగిరి రూరల్ ఎస్సై చంద్రబాబు, ఎస్సై శ్రీశైలం, ఏఎస్సై మహిపాల్ పాల్గొన్నారు.
ప్రజావాణి రద్దు


