రూ.2302.94 కోట్ల రుణాలు పంపిణీ
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ హనుమంతరావు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాల కింద మొత్తం రూ.2302.94 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వీటిలో పంట రుణాలే రూ.1809.22 కోట్లు విడుదల అయ్యాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత రుణాల వార్షిక లక్ష్యం 53.04 శాతం సాధించడం మంచి పురోగతిగా అభివర్ణించారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.415.94 కోట్లు రుణాలు మంజూరవడం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారులకు గణనీయమైన ఊతం లభించిందన్నారు. ప్రాధాన్య రంగాల రుణాల్లో కూడా ఇప్పటివరకు 46.08 లక్ష్యం చేరుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. పీఎంఎంవై పథకం కింద 8052 ఖాతాలకు రూ 129.03 కోట్లు, మహిళా సంఘాలకు 283.17 కోట్ల రుణాలు, మెప్మా సంఘాలకు రూ 73.85 కోట్లు రుణాల మంజూరు చేసినట్లు చెప్పారు. పీఎం సేవా నిధి పథకం కింద మూడు విడతల్లో మొత్తం 12,523 దరఖాస్తులు మంజూరయ్యాయన్నారు. ఇంకా బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే ప్రాసెస్ చేసి మంజూరు చేయాలని బ్యాంకులు, మెప్మా అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీ తక్కువగా ఉన్న గుండాల, మోత్కూర్, అడ్డగూడూర్, నారాయణపూర్ మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, అదనపు డీఆర్డీఓ జంగారెడ్డి, మెప్మా పీడీ రమేష్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీశ్రావ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం కమలాకర్ తదితర ప్రభుత్వ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


