మహిళల ఆర్థిక సంక్షేమానికే వడ్డీలేని రుణాలు
భువనగిరి: మహిళల ఆర్థిక సంక్షేమానికే స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల ఫంక్షన్ హాల్‌లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు 3772 స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ. 566.86 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రతి మహిళ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలకు గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందిస్తున్నామన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు రూ. 566.86 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైజ్‌చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖబాబురావు, మండల సమాఖ్య అధ్యక్షులు, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి


