అవే సమస్యలు.. తీరని వ్యథలు
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తలేరని, భూమిని కబ్జా చేశారని, ఏడు దశాబ్దాలుగా కబ్జాలో ఉన్నా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని.. ఇలా రకరకాల సమస్యలను ప్రజలు ప్రజావాణిలో ఏకరువుపెట్టారు. పదేపదే తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ హనుమంతరావు అర్జీలు స్వీకరించారు. 58 అర్జీలు రాగా వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.ఎప్పటి మాదిరిగానే రెవెన్యూకు సంబంధించి 41 వినతులు వచ్చాయి. వినతులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని, సమస్య తమ పరిధిలో లేకపోతే దరఖాస్తుదారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌ఓ జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, హౌసింగ్ పీడీ విజయసింగ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● వక్ఫ్ భూములు ఆన్‌లైన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉమిద్ పోర్టల్ క్యాంపును భువనగిరిలో ఏర్పాటు చేయాల వక్ఫ్‌బొర్డు మాజీ సభ్యుడు మహ్మద్ షరీప్ కలెక్టర్‌కు విన్నవించారు. యాదాద్రి జిల్లాలో వక్ఫ్ భూములు అధిక సంఖ్యంలో ఉన్నాయని, ఉమిద్ పోర్టల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల ఆన్‌లైన్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
● 70 ఏళ్లుగా భూములు సాగదు చేసుకుంటున్నామని, హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని సంస్థాన్‌నారాయణపురం మండలం రాచకొండ గ్రామానికి చెందిన గిరిజన రైతులు వినతిపత్రం అందజేశారు.
ఫ ప్రజావాణిలో గోడు వెల్లబోసుకున్న అర్జీదారులు
ఫ వినతులు స్వీకరించిన కలెక్టర్


