పెండింగ్ బిల్లులు క్లియర్ చేయిస్తా
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఎటువంటి బిల్లులు పెండింగ్ ఉన్నా సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని, సీఎంతో మాట్లాడి క్లియర్ చేయిస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఈఓ వెంకట్రావుతో కలిసి దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరి కొండపైన భక్తులు బస చేసేందుకు డార్మిటరీ హాల్ నిర్మాణం, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించి త్వరగా సమర్పించాలని ఆదేశించారు. వీటితో పాటు దాతల సహకారంతో టెంపుల్ సిటీలో నిర్మిస్తున్న అతిథిగృహాలు, పెండింగ్ అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అదే విధంగా భక్తులకు నిత్యాన్నదాన వితరణ చేయటానికి విధివిధానాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈఓ వెంకట్రావ్ వివరించారు. అంతకుముందు మంత్రి యాదగిరీశుడిని దర్శించుకొని పూజలు చేశారు. ఆయన వెంట మహిళా కో–ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, మాజీ డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఉన్నారు. మంత్రికి కలెక్టర్ హనుమంతరావు, అదనపు వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేష్ స్వాగతం పలికారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


