ఆటోను ఢీకొన్న జేసీబీ.. ఒకరు మృతి
నాగారం: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారంబంగ్లా వద్ద ఆదివారం జేసీబీ ఆటోను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటో నాగారం బంగ్లాలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న జేసీబీని ఓవర్‌టేక్ చేయబోతుండగా జేసీబీ వెనుక ఉన్న బొక్కెన తగిలి ఆటో ప్రమాదానికి గురైంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వర్ధమానుకోట గ్రామానికి చెందిన బండారి ప్రభుదాస్(75) బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలకు, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ భగవాన్ తెలిపారు.
ఫ మరో ముగ్గురికి గాయాలు


