గోవులు తరలిస్తున్న వాహనం పట్టివేత
చౌటుప్పల్: అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ సంతలో ఆరు గోవులు, మూడు ఎద్దులను కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని బహదూర్‌పురాకు తరలిస్తుండగా.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. వాహన డ్రైవర్ షేక్ ఆరీఫ్, సహాయకుడు షేక్ ఖలీల్‌పాషను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గోవులు, ఎద్దులను గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
మేడపై నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం
ఇబ్రహీంపట్నం రూరల్: తమ్ముడి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన అన్న మేడపై నుంచి జారి పడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన కుంచెల ముత్యాలు వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. ఆయన సోదరుడు శ్రీశైలం(30) పెళ్లి పత్రికలు పంచడానికి శనివారం రంగారెడ్డి తుర్కయంజాల్‌లో ఉంటున్న వారి బంధువు విష్ణు ఇంటికి వెళ్లాడు. రాత్రి కావడంతో అక్కడే భోజనం చేసి ఇల్లు ఇరుకుగా ఉండడంతో మూడు అంతస్తుల మేడ పైన అందరూ నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చూసేసరికి శ్రీశైలం కనిపించలేదు. చుట్టూ వెతకగా కింద కుక్కలు అరస్తుండటం గమనించి దగ్గరకు వెళ్లి చూడగా.. తీవ్ర గాయలతో శ్రీశైలం విగతజీవిగా పడి ఉన్నాడు. నిద్రమత్తులో రెయిలింగ్‌పై నుంచి పడి చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భూవివాదం.. కేసు నమోదు
మునగాల: మునగాల మండలం బరాఖత్‌గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య నెలకొన్న భూవివాదంలో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. బరాఖత్‌గూడేనికి చెందిన దొంతిరెడ్డి కళావతికి కుమారుడు ఉపేందర్‌రెడ్డి, కుమార్తె రెణబోతు జ్యోతి ఉన్నారు. ఉపేందర్‌రెడ్డి, జ్యోతి మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. జ్యోతి బరాఖత్‌గూడెంలో తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి కౌలుకు ఇచ్చింది. జ్యోతి తన భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆదివారం బరాఖత్‌గూడేనికి వచ్చి కౌలు రైతుతో కలసి వరి పంటను కోయిస్తుండగా.. అక్కడకు చేరుకున్న కళావతి, ఉపేందర్‌రెడ్డి వరికోత యంత్రాన్ని ఆపారు. అడ్డుకోవడానికి వెళ్లిన జ్యోతి, ఆమె భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తైపె ఉపేందర్‌రెడ్డి దాడి చేశాడు. అంతేకాక జ్యోతి ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘర్షణలో గాయపడిన జ్యోతి, ఇద్దరు కుమార్తెలు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కళావతి, ఉపేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన అరుణాచలేశ్వర అకాడమీ కళాకారిణులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. ఆలయ మాడ వీధిలో స్వామి వారి గీతాలకు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అంతే కాకుండా హైదరాబాద్‌కు చెందిన శ్రీనృత్య అకాడమీ కళాకారులు సైతం భక్తులను తమ సంప్రదాయ నృత్యాలతో కనువిందు చేశారు.


