ర్యాంకుల కోసం తాపత్రయపడొద్దు
చౌటుప్పల్: ర్యాంకుల కోసం తాపత్రయపడే ఆలోచనా విధానం మారాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల నుండి గౌవర వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు సైతం అంతే ముఖ్యమన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఓటమితో కుంగిపోవద్దని, ఓటమి నుండే గెలుపు ఉద్భవిస్తుందన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తద్వారా శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారని గుర్తుచేశారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి 240 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచ్ బాతరాజు సత్యం, ఎస్‌జీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథరెడ్డి, ఎంఈఓ గురువారావు, క్రీడల రాష్ట్ర పరిశీలకులు వాసం నవీన్, పులి కిషోర్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, క్రీడల ఆర్గనైజర్ కృష్ణమూర్తిగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఫ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ఫ పంతంగి గ్రామంలో రాష్ట్రస్థాయి
ఖోఖో పోటీలు ప్రారంభం
ర్యాంకుల కోసం తాపత్రయపడొద్దు


