సహకార సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలి
యాదగిరిగుట్ట: సహకార సంఘాలు సహకార సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలని జాతీయ సహకార భారతి ప్రముఖ్, ప్రధాన కార్యదర్శి దీపక్ చౌరసియా, రాష్ట్ర అధ్యక్షుడు ఝెక్కటి ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర సహకార భారతి ఆధ్వర్యంలో కార్యకర్తల రాష్ట్ర అభ్యసవర్గ రెండు రోజుల శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. సహకార సంఘాల సభ్యులంతా ఐక్యతను పాటిస్తూ, సహకార సూత్రాలను వ్యాప్తి చేయాలన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ శాఖ పనిచేస్తుందన్నారు. అంతకుముందు సహకార భారతి జెండాను ఆవిష్కరించారు. ఈ శిక్షణ శిబిరంలో అఖిల భారత సహ సంపర్క ప్రముఖ్ అడ్డూరి శ్రీనివాస్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యకారిణి సదస్యులు అన్నదానం సుబ్రహ్మణియం, ప్రధాన కార్యదర్శి నాగిళ్ల కుమారస్వామి, వర్గ ప్రముఖ్ పి. సత్యనారాయణ, సహ ప్రముఖ్ బాలరాజు, ప్రాంత అధి కారులు శంకరయ్య, విఠలయ్య, పాండురంగారెడ్డి, సుమంత్, బాలరాజ్, రమాదేవి పాల్గొన్నారు.


