కాంగ్రెస్ పార్టీ బీసీల గొంతుకోసింది
చౌటుప్పల్ : పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయబద్దంగా రావాల్సిన వాటా ఇవ్వాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలకల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ భిక్షగా ఇచ్చే సీట్లను బీసీ సమాజం ఒప్పుకోదన్నారు. బీసీ జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి చౌటుప్పల్ పట్టణంలో జీఓ 46 ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తరువాత కామారెడ్డి డిక్లరేషన్‌ను విస్మరించిందని ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీఓ 9 విడుదల చేసి, ఇప్పుడు జీఓ 46 ఇవ్వడం బీసీల గొంతు కోయడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన మోసంపై కవులు, రచయితలు, కళాకారులు గళమెత్తాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చౌటుప్పల్‌లో జరిగిన సభలో ఉద్యమంపై సినిమా తీయమని కోరిన వెంటనే దర్శకుడు శంకర్ స్పందించారని, జైబోలో తెలంగాణ చిత్రం నిర్మించి ఉద్యమానికి నిప్పురాజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీసీ ఉద్యమానికి మద్దతుగా సినిమాలు తీయాల్సి అవసరం వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు జాజుల లింగంగౌడ్, ఉప్పల మధు, గూడూరు భాస్కర్, ఆదిమళ్ల శంకర్, జోర్రిగల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
ఫ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్


