రైతులను వేధింపులకు గురిచేస్తే ఊరుకోం
రామన్నపేట: రాజకీయ కక్షలతో రైతులను వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలోని మందడి సాగర్‌రెడ్డికి చెందిన ధాన్యం మిల్లులో దిగుమతి చేసుకోకుండా తిరిగి పంపిన విషయం తెలుసుకున్న ఆయన శనివారం గ్రామానికి వెళ్లారు. లారీని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులు తేమను పరిశీలించి సర్టిఫై చేసిన అనంతరం, పీఏసీఎస్ అధికారులు తూకం వేయించి ఇతర రైతుల పేరుతో ట్రక్‌షీట్ రాసి లారీలో లోడ్ చేయించి మిల్లుకు పంపిన ధాన్యంను దిగుమతి చేసుకోకుండా వాపస్ పంపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి ధాన్యం దిగుమతి చేయించక పోతే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మందడి సాగర్‌రెడ్డి, గర్దాసు విక్రం, బందెల రాములు, బద్దుల రమేష్, సాల్వేరు అశోక్, ఎస్‌కే చాంద్, మంటి లింగస్వామి తదితరులున్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


