
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
బీబీనగర్: కారును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా శనివారం రాత్రి జరిగింది. సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరికి చెందిన తంగెళ్లపల్లి సత్యనారాయణచారి(50), భువనగిరికి చెందిన ఎర్రోజు రాజు(42) కలిసి పని నిమిత్తం శనివారం హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వస్తుండగా.. బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న కారును అదుపుతప్పి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సత్యనారాయణచారి, రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజు మృతిచెందాడు. ఆస్పత్రికి చేరుకున్నాక సత్యనారాయణ మృతిచెందాడు. మృతుల కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మిన్నంటిన రోదనలు..
భువనగిరి: ఎర్రోజు రాజు, సత్యనారాయణచారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఉదయం ఆస్పత్రికి చేరుకోవడంతో వారి రోదనలతో మిన్నంటాయి. రాజుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం