కలగా మత్స్యకార కల్యాణ మండపం
కల్యాణ మండపం కట్టాలి
నరసాపురం: నరసాపురం పట్టణంలోని పార్కు రోడ్డులో నిరుపయోగంగా ఉన్న మోడల్ ఫిష్‌మార్కెట్ స్థానంలో మత్స్యకార కల్యాణ మండపం ఏర్పాటు చేయాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. మత్స్యకారులకు ఎప్పటి నుంచో కలగా ఉన్న కల్యాణ మండపం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న మత్స్యకారుల కోరిక కలగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గంలో దాదాపు లక్ష వరకూ జనాభా ఉన్న మత్స్యకారులకు స్థానికంగా ఇంతవరకూ ప్రత్యేకంగా ఓ కల్యాణ మండపం లేకపోవడం గమనార్హం. నరసాపురం మున్సిపాలిటీలో కూడా పెద్దసంఖ్యలో మత్స్యకార జనాభా ఉంది. పట్టణంలో మత్స్యకారులకు ప్రత్యేకంగా ఓ కల్యాణ మండపం లేదు. పట్టణంలో మిగిలిన కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ప్రత్యేక కల్యాణ మండపాలు ఉన్నాయి. మత్స్యకారులు తమకు కల్యాణ మండపం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రయత్నం
పార్కు రోడ్డులో 2007లో మోడల్ ఫిష్ మార్కెట్ భవనాన్ని రూ.17 లక్షలతో నిర్మించారు. వ్యాపారాలకు అనువుగా ఉండే ప్రాంతం కాదని ఆ భవనంలోకి మత్స్యకారులు షాపులు పెట్టుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో మోడల్ ఫిష్‌మార్కెట్ భవనం అప్పటి నుంచి ఖాళీగా ఉంది. దీంతో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆ భవనాన్ని మత్స్యకార కళ్యాణమండపంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అప్పటి మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజును తీసుకొచ్చి, కళ్యాణమండపంగా మార్చడానికి రూ.30 లక్షలు నిధులు మంజూరు చేయించారు. ప్రభత్వం మారిన తరువాత ఈ ప్రతిపాదన బుట్టదాఖలైంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కూటమి నేతలు కూడా ఇంతవరకూ మత్స్యకారులకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో మత్స్యకార కల్యాణ మండపం కల సాకారం అయ్యేలా కనిపించడంలేదు.
ప్రభుత్వం మారడంతో ఆగిన ప్రతిపాదనలు
మోడల్ ఫిష్ మార్కెట్ స్థలం మున్సిపాలిటీదే. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అప్పటి మంత్రిని కల్యాణ మండపంగా తీర్చిదిద్దాలని కోరారు. వెంటనే ఆయన అంగీకరించి నిధులు మంజూరు చేశారు. పనులు ప్రారంభమయ్యే దశలో ఎన్నికలు రావడంతో పెండింగ్‌లో పడింది. నరసాపురంలో మత్స్యకార సోదరులు అధిక సంఖ్యలో ఉన్నారు. కచ్చితంగా కళ్యాణ మండపం కట్టాలి. ఇందుకు మున్సిపాలిటీ పాలకవర్గం కూడా అనుకూలంగా ఉంది.
– బర్రి శ్రీవెంకటరమణ, మున్సిపల్ చైర్‌పర్సన్
కలగా మత్స్యకార కల్యాణ మండపం


