ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 15 నుంచి ఏలూరు జిల్లాలో నేనూ బడికి పోతా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ బీ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బడి బయట ఉన్న పిల్లలు, బడిలో నమోదు కాని 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలను గుర్తించి వారిని బడిలో చేర్చేలా ప్రత్యేక నమోదు కార్యక్రమం ఈ నెల 21వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యపై అవగాహన కల్పించి పాఠశాలల్లో చేర్పించడానికి జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో సీఆర్‌పీలు, ఐఈఆర్‌పీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కేజీబీవీ సీఆర్‌టీ ఉపాధ్యాయులు, గ్రామ వలంటీర్లు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలన్నారు. సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులందరూ ఆయా మండలాల్లో పర్యవేక్షిస్తూ బడి బయట ఉన్న, బడిలో నమోదుకాని పిల్లలందరినీ బడిలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం బడి ఉత్సవం – బాలికా ఉత్సవం పేరిట మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని, 18న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్చాలని, 19వ తేదీన విద్యా సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 20న సమాజంతో ఒక రోజు కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు.