ఓటుకు దూరం | Sakshi
Sakshi News home page

ఓటుకు దూరం

Published Mon, May 20 2024 3:50 AM

ఓటుకు దూరం

2019 ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్‌ సరళి

నియోజకవర్గం ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్‌ శాతం

ఆచంట 1,74,307 1,37,294 79.6

పాలకొల్లు 1,90,181 1,55,251 82.3

నరసాపురం 1,68,186 1,35,413 81.2

భీమవరం 2,46,320 1,90,569 78

ఉండి 2,19,561 1,84,192 84.80

తణుకు 2,32,212 1,86,609 81.2

తాడేపల్లిగూడెం 2,08,771 1,65,972 80.4

2024 ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్‌ సరళి

నియోజకవర్గం ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్‌ శాతం

ఆచంట 1,80,017 1,49,048 82.8

పాలకొల్లు 1,95,057 1,60,489 82.28

నరసాపురం 1,70,448 1,43,825 84.38

భీమవరం 2,53,116 2,00,857 79.35

ఉండి 2,24,725 1,93,722 86.2

తణుకు 2,34,575 1,92,736 82.16

తాడేపల్లిగూడెం 2,14,985 1,75,990 81.86

సాక్షి, భీమవరం: ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన ఓటుహక్కు వినియోగంలో కొందరు ఆసక్తి చూపడం లేదు. కారణమేదైనా సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 17.4 శాతం మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోలేదు. అత్యధికంగా భీమవరంలో 20.65 శాతం మంది, అత్యల్పంగా ఉండిలో 13.8 శాతం మంది ఓటు హక్కుకు దూరమయ్యారు. తమను పాలించే పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛను పౌరులకే కల్పిస్తూ భారత రాజ్యంగం ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. పేరుకు రెండు అక్షరాలే అయినా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే ఆయువుపట్టు. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకునేలా చైతన్యవంతం చేస్తూ ఏటా ఎన్నికల సంఘం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం గత ఏడాది చేపట్టిన స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 35 వేలకు పైచిలుకు కొత్త ఓటర్లను నమోదు చేయించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఓటుకు దూరంగా 2,56,256 మంది ఓటర్లు

జిల్లాలో 14,72,923 మంది ఓటర్లకుగాను సార్వత్రిక ఎన్నికల్లో 12,16,667 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 2,56,256 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో 52,259 మంది ఓటు వేయలేదు. ఆచంటలో 30,969, పాలకొల్లులో 34,568, నరసాపురంలో 26,623, ఉండిలో 31,003, తణుకులో 41,839, తాడేపల్లిగూడెంలో 38,995 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆక్వా, పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వేలాది కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. ఎన్నికల సమయంలో వారు స్వస్థలాలకు వెళ్లి ఉండవచ్చని, కొందరు కావాలనే దూరంగా ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఓటరు జాబితాలో పేరు లేకపోతే నానా హంగామా చేయడంలో చూపించిన శ్రద్ధ ఓటు వచ్చాక వేయడంలో ఉండటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో పోలిస్తే 1,58 శాతం పెరిగిన పోలింగ్‌

2019 ఎన్నికల్లో జిల్లాలో 14,39,538 మంది ఓటర్లకు గాను 11,55,300 మంది ఓటు వేయగా 2,84,238 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటు వేయని వారి సంఖ్య తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. మునుపెన్నడూ లేని విధంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రస్తుత ఎన్నికల్లో చాలాచోట్ల పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి రాత్రి 11 గంటల సమయంలోను ఎంతో ఓపిగ్గా పలువురు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గతంతో కన్నా 1.58 శాతం మేర పోలింగ్‌ పెరగడానికి ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోని 17.4 శాతం ఓటర్లు

గతంతో పోలిస్తే 1.58 శాతం తగ్గుదల

అత్యధికంగా భీమవరంలో20.65 శాతం ఓటుకు దూరం

Advertisement
 
Advertisement
 
Advertisement