
సాక్షి, వరంగల్: ప్రజలకు నాణ్యమైన.. అత్యవసర వైద్య సేవలు అందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన వారికి అత్యవసరంగా అందించే చికిత్సలో మెళకువలు ప్రాక్టికల్‌గా నేర్పేందుకు కాకతీయ మెడికల్ కాలేజీలో త్వరలోనే నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్(ఎన్‌ఈఎల్‌ఎస్) ట్రైనింగ్ రీజనల్ సెంటర్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ.17కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. వచ్చే నెలలో షురూ కానున్న శిక్షణలో వందలాది మంది వైద్యులు, నర్స్‌లు, అంబులెన్స్ సిబ్బందితోపాటు పారా మెడికల్ సిబ్బందికి కూడా ఎమర్జెన్సీ సేవల్లో అనుసరించాల్సిన తీరుపై ప్రధానంగా తర్ఫీదు ఇవ్వనున్నారు. విదేశాల్లో మాదిరిగానే దేశంలో కూడా నాణ్యమైన వైద్యం అందాలన్న ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌ఈఎల్‌ఎస్ కోర్సు ద్వారా అత్యవసర సమయాల్లో వేలాది మంది రోగులను బతికించే అవకాశం ఉంది. ఎందుకంటే.. రోగి ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు అందించే వైద్య సేవల్లో సిబ్బంది చేసే చిన్నచిన్న పొరపాట్లు, ఆ సమయంలో ఏమి చేయాలో తోచకపోవడం, ఎక్విప్‌మెంట్ల వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ రోగులు బతకడం వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అందుకే.. ఆయా సమయాల్లో ఏమాత్రం తత్తరపాటుకు తావివ్వకుండా వైద్య సేవలు ఎలా అందించాలనే అంశంపై ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టికల్‌గా చేయించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలోని నెల్స్ కోర్సులో కేఎంసీ కాలేజీ నుంచి నలుగురు ప్రొఫెసర్లు డాక్టర్ విజయ్‌కుమార్(పిడియాట్రిషన్), మురళి(అనస్తీషియా), నిరంజనాదేవి(గైనకాలజీ), వెంకట్(మెడికల్) ఇటీవల శిక్షణ పొందారు.
ఎలా ఉంటుందంటే...
ముఖ్యంగా మెడికల్, సర్జికల్, కార్డియాక్ ఎమర్జెన్సీ, శ్వాస, గాయ సంబంధిత అత్యవసర పరిస్థితులు, ప్రసూతి అత్యవసర పరిస్థితులు, పిడియాట్రిక్ ఎమర్జెన్సీస్ తదితరాలు అత్యవసర వైద్య సేవల కిందకు రానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, నర్స్‌లతోపాటు మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు నెల్స్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కార్డియాక్ అరెస్టయిన సమయంలో సీపీఆర్ ఎలా చేయాలి.. ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలటర్(ఏఈడీ) మెషీన్లు ఎలా ఉపయోగించాలి.. పిడియాట్రిక్ ఎమర్జెన్సీ సమయంలో బ్యాగ్ మాస్క్ వెంటిలేషన్ టెక్నిక్, గర్భవతుల విషయంలో లెఫ్ట్ యుటరైన్ డిస్‌ప్లేస్‌మెంట్ సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశాలను ప్రాక్టికల్‌గా చూపించనున్నారు. ఇలా ఎమర్జెన్సీ ట్రైనింగ్ సర్వీస్ విషయంలో టీమ్‌గా ఎలా విధులు నిర్వర్తించాలనే దానిపై కూడా అవగాహన కల్పించనున్నారు.
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే వైద్య సేవలపై శిక్షణ
ఇప్పటికే ఉస్మానియా
మెడికల్ కాలేజీలో నెల్స్ ట్రైనింగ్
కేఎంసీలోనూ
రీజినల్ సెంటర్‌కు శ్రీకారం
మరో నెలరోజుల్లో వైద్యులు,
నర్స్‌లకు షురూ కానున్న శిక్షణ
తొలుత మాన్‌క్వీన్, ఆ తర్వాత
సిమ్నేటర్స్‌తో ట్రైనింగ్
మూడు దశల్లో సేవలు
అత్యవసర వైద్య సేవల విషయాల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, నర్స్‌లు, పారా మెడికల్ విద్యార్థుల్లో మేథాశక్తిని పెంపొందించేందుకు ఉద్దేశించిందే నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్(ఎన్‌ఈఎల్‌ఎస్) కోర్సు. కేఎంసీలో రీజినల్ సెంటర్‌కు ఇప్పటికే రూ1.50కోట్ల విలువచేసే మాన్‌క్వీన్స్ వచ్చాయి. రూ.10కోట్ల విలువచేసే సిమ్నేటర్స్ కూడా రానున్నాయి. ఈ కోర్సులో తొలుత మాన్‌క్వీన్స్(బొమ్మలు) ఉపయోగించి అత్యవసర సమయాల్లో ఎలా వ్యవహరించాలో ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత సిమ్నేటర్స్ ద్వారా అంటే.. రోగులకు సర్జరీ చేసినట్టుగానే హ్యాండ్స్ మూవ్ చేయడం వల్ల దేని తర్వాత ఎలా చేయాలన్న స్టెప్పులను అనుకరించాల్సి ఉంటుంది. దీనికి స్కోరింగ్ కూడా వస్తుంది. పర్ఫెక్ట్ చేసేంత వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఆస్పత్రుల్లో నిజంగానే అత్యవసర విభాగంలో రోగులకు ఈ సేవలు అందిస్తా రు. సర్జరీలు కూడా చేస్తారు. ఇలా ప్రాక్టికల్ ట్రై నింగ్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో తడబాటు లేకుండా వైద్య సేవలు అందించడం వల్ల ప్రాణా లు నిలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
– డాక్టర్ మోహన్‌దాస్, కేఎంసీ ప్రిన్సిపాల్
