వీసీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వరంగల్ రూరల్: ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన తదితరులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీవత్స మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 56 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,728 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశామన్నారు. వీసీలో డి.వాసంతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కాజీపేట వెంకటరమణ, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.