పౌరసరఫరాలశాఖలో కోల్డ్‌వార్!
డీఎస్‌ఓపై లోకాయుక్తలో ఫిర్యాదు
నాపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు ఎలాంటి సమాచారం లేదు. అక్కడి నుంచి నోటీసులు వచ్చాక అందులో ఏమి ఉందో చూసి తర్వాత స్పందిస్తా. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నా. ఎవరితోనూ వైరం లేదు. మిల్లర్లందరినీ సమానంగానే చూస్తాం.
– కాశీవిశ్వనాథ్,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
వనపర్తి: కొద్దిరోజులుగా జిల్లా పౌరసరఫరాలశాఖలోని కొందరు అధికారులు, మిల్లర్లలోని ఓ వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తాజా పరిస్థితుల ఆధారంగా స్పష్టమవుతోంది. రాజుకున్న విభేదాల నిప్పు లోకాయుక్తలో ఫిర్యాదు వరకు చేరింది. మంగళవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌పై ఓ సంఘం నేత లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. సంబంధితశాఖలోని కొందరు అధికారులు నచ్చిన మిల్లర్లతో ఒకలా.. నచ్చని మిల్లర్లపై మరోలా వ్యవహరిస్తూ ధాన్యం కేటాయింపులు, కేసుల నమోదు వంటి అంశాల్లో ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ ఏప్రిల్‌లో అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. అధికారులు విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ డీఎస్‌ఓపై లోకాయుక్తలో ఫిర్యాదుచేసి ఆ ప్రతితో పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా.. పౌరసరఫరాలశాఖ అధికారులు, మిల్లర్లలో రెండు వర్గాలు ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో చాలా విషయాల్లో విభేదాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏళ్లుగా మరుగునపడిన నిబంధనలకు తూట్లు పొడిచి రహస్యాలు సైతం ఇటీవల బయటకు లీకులిచ్చినట్లు తెలుస్తోంది.
జిల్లాలో తాజాగా వెలుగుచూసిన ఘటనలు..
● అక్టోబర్ 12న పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని రెండు మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రూ.12.50 కోట్ల పైచిలుకు విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులకు జిల్లాశాఖ నుంచే ఉప్పందినట్లు ప్రచారం సాగుతోంది.
● పెబ్బేరు మండలం కంచిరావుపల్లి శివారులో ఉన్న ఓ మిల్లుపై జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేసి గద్వాల జిల్లాకు చెందిన ధాన్యాన్ని పట్టుకున్నారు. జిల్లాలో తీసుకున్న ధాన్యం సీఎంఆర్ చెల్లింపుల విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని, ఇతర ప్రాంతానికి చెందిన ధాన్యం నిల్వ చేశారనే కారణాలతో శాఖాపరమైన చర్యలకు సిఫారస్ చేశారు. డీఎస్‌ఓ ఉద్దేశపూర్వకంగా కొందరు మిల్లర్లను టార్గెట్ చేస్తున్నారంటూ బీసీ సంఘం నాయకులు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
● మిల్లర్లలోని ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఇచ్చిన చిరునామాలో మిల్లు లేకపోయినా 2022–23 వానాకాలం ధాన్యం కేటాయింపులు చేయడం, అక్కడి నుంచి కొద్దిమేర బియ్యం చెల్లింపులు చేసిన విషయం బయటకు వచ్చింది. మూడురోజుల తర్వాత డీఎస్‌ఓపై బీసీ సంఘం నాయకులు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఓ వర్గం మిల్లర్లు..
అధికారుల మధ్య విభేదాలు
ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న విషయాలు
వెలుగుచూస్తున్న వైనం
జిల్లాలో సీఎంఆర్, యాక్షన్ ప్యాడీ సుమారు రూ.700 కోట్ల మేర పెండింగ్
రోజుకో ఎత్తుగడతో ధాన్యం
తీసుకుంటున్న కొందరు మిల్లర్లు
పౌరసరఫరాలశాఖలో కోల్డ్‌వార్!


