శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ : ఎస్పీ
వీపనగండ్ల/చిన్నంబావి: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి, చిన్నంబావి మండలం పెద్దదగడ, పెద్దమారూర్‌లో నామినేషన్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఓటర్లు ఎన్నికల సిబ్బంది, పోలీసులకు సహకరించినప్పుడే స్థానిక ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయని తెలిపారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రాణి తదితరులు ఉన్నారు.
వనపర్తి రూరల్: పెబ్బేరులోని కొల్లాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను బుధవారం ఎస్పీ సునీతరెడ్డి తనిఖీ చేశారు. వాహన తనిఖీలు, వివరాల నమోదు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెక్‌పోస్ట్‌ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలను ప్రభావితం చేసే నగదు, మద్యం, బంగారం రవాణాకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ప్రజలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వరావు, ఎస్‌ఐ లు యుగంధర్‌రెడ్డి, దివ్య, సిబ్బంది ఉన్నారు.


