
పంటలకు నీటిని విడుదల చేయలేం
వనపర్తి: జూరాల జలాశయంలో నీటిమట్టం పడిపోయినందున తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ప్రస్తుతం నీటిని విడుదల చేయలేమని, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కొంత నీటిని జలాశయానికి వదిలేలా చూడాలని రాష్ట్ర మంత్రులను కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శనివారం మధ్యాహ్నం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వరి ధాన్యం కొనుగోలు, సన్నరకం బియ్యం పంపిణీ, తాగునీటి సరఫరాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సీఎంఆర్ చెల్లింపుల్లో నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి మిల్లర్ల నుంచి 72 శాతం, ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో సైతం 50 శాతం వసూలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 19 మిల్లులతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, పౌర సరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఇరిగేషన్ అధికారులు, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి తదితరులు పాల్గొన్నారు.