
ఎస్సీ, ఎస్టీల శ్మశానవాటికలకు స్థలాలు
విజయనగరం అర్బన్:
ఎస్సీ, ఎస్టీలకు శ్మశాన వాటికలు లేనిచోట వెంటనే స్థలాలు కేటాయించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. స్థలాలను గుర్తించే ప్రక్రియను వారంపది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్డీఓలకు సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటిపై తీసుకున్న చర్యలు, అందించిన పరిహారం, ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లోని సమస్యలు, గత సమావేశపు అజెండాపై తీసుకున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై వెంటనే కేసులు నమోదు చేయాడంతో పాటు, బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సాయాన్ని, పరిహారాన్ని అందించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించి, పరిశుభ్రంగా తయారు చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ ఎస్.సేతుమాధవన్, ఇన్‌చార్జి డీఆర్వో మురళి, సాంఘిక సంక్షేమశాఖడీడీ ఎం.అన్నపూర్ణ, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు బసవ సూర్యనారాయణ, సున్నపు రామస్వామి, చంపి సన్యాసిరావు, మజ్జి గణపతి, ఎం.రాము, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

ఎస్సీ, ఎస్టీల శ్మశానవాటికలకు స్థలాలు